ఎలక్షన్లలో తగ్గేదేలే.. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మనోళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి

ఎలక్షన్లలో తగ్గేదేలే.. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మనోళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి
  • ఎంపీటీసీ నుంచి జడ్పీ చైర్మన్‍ వరకు ఏ ఒక్కటి వదలొద్దు
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తాం
  • ఈ ఏడాది వడ్డీలేని రుణాల టార్గెట్‍ రూ.30 వేల కోట్లు 
  • రూ.14.17 కోట్లతో 20 వేల మెగా టన్నుల సామర్ధ్యమున్న గోదాం పనులకు శ్రీకారం

వరంగల్‍/రాయపర్తి, వెలుగు: ''రాష్ట్రంలో ప్రభుత్వం మీది.. ముఖ్యమంత్రి మనవారు.. మంత్రులు మనోళ్లు, ఎంపీలు మనోళ్లు, ఎమ్మెల్యేలు మనోళ్లు.. లోకల్‍ బాడీ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా తగ్గొద్దు. ప్రతి కాంగ్రెస్‍ కార్యకర్త సైనికుడిలా పనిచేసి ఎంపీటీసీ నుంచి జిల్లా పరిషత్‍ చైర్మన్‍ వరకు ఏ ఒక్క సీటు వదలకుండా కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని''  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వరంగల్‍ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పర్యటించారు. రూ.14.17 కోట్లతో 20 వేల మెగా టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు, కాంగ్రెస్‍ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ, కలెక్టర్‍ సత్యశారదతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‍ పార్టీ అంటే ఏనాడూ మాయమాటలు చెప్పదన్నారు. ''మూడు రంగుల కాంగ్రెస్‍ పార్టీ అంటే పునాదులు చాలా లోతుగా ఉంటాయ్‍. ఆ వైబ్రెషన్‍ ఏంటో మొన్నటి ఎలక్షన్లో 10 ఏండ్లు అధికారంలో ఉన్నోళ్లు చూసిన్రు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు దాటరని చెప్పినా. కానీ, జనాలు ఖమ్మం వరకే పరిమితం కాకుండా తెలంగాణ మొత్తం నాటి ప్రభుత్వ పెద్దల అహంకారాన్ని బొంద పెట్టారన్నారు. సర్పంచ్‍ హోదా నుంచి ఎంపీటీసీ, వార్డ్‍ మెంబర్‍, ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్‍ చైర్మన్‍ కావాలనుకునే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

రైస్‍ మిలుల్లు, కోళ్ల ఫారాల్లో స్కూళ్లుపెట్టి.. గొప్పలు చెప్పిన్రు

రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం రెసిడెన్షియల్‍ స్కూళ్లు మూతపడ్డ రైస్‍ మిల్లులు, కోళ్ల ఫారాల్లో పెట్టి గొప్పలు చెప్పుకుందని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‍ ప్రభుత్వం ఇప్పటివరకు 80 నియోజకవర్గాల్లో ఒక్కోచోట రూ.200 కోట్ల చొప్పున ఇంటిగ్రేటేడ్‍ యంగ్‍ ఇండియా స్కూళ్ల కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. 10 ఏండ్ల బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం పేదోళ్ల గురించి కనీస ఆలోచన చేయలేదన్నారు. మిషన్‍ భగీరథ, కాళేశ్వరం పేరుతో ధనిక రాష్ట్రాన్ని దొరికినంత దోచుకున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ఎన్ని అప్పులున్నా.. మరెన్ని అవంతరాలొచ్చినా పేదల కోసమే పనిచేస్తోందన్నారు.

మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. ప్రతి సోమవారం వీటికి సంబంధించిన డబ్బులు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్‍ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని భరోసా ఇచ్చారు. మహిళా సంఘాలకు గతేడాది రూ.21 వేల కోట్లతో వడ్డీలేని రుణాలు అందించగా, ఈ ఏడాది కూడా రూ.30 వేల కోట్లు ఇచ్చేలా టార్గెట్‍ పెట్టుకున్నామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అవాకులు చెవాకులు పేలిన మాజీ మంత్రికి పాలకుర్తి ప్రజలు కర్రుకాచి వాత పెట్టారన్నారు. కోరలు ఉన్నాయని విర్రవిగే ఇలాంటి నాయకుల కోరలు పీకాలన్నారు.

ప్రజలకు ఉపయోగపడేదే చేస్తాం..

గతంలో ఉన్న నాయకుల మాదిరి ఎలక్షన్​స్టంట్లు వేయమని, ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అదే చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. అగ్రిమెంట్ కాకముందే ఫౌండేషన్​ వేసే బుద్ధి ఎవరిదో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వరంగల్​ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ మాపై నమ్మకంతో గెలిపించిన కార్యకర్తలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా మా వంతు కృషి చేస్తామన్నారు.

అందరం కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్​అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గిడ్డంగుల కార్పొరేషన్​ చైర్మన్​రాయల నాగేశ్వర్​రావు, బ్లాక్​కాంగ్రెస్​అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్​రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.