
ఇల్లెందు, వెలుగు: పోడు రైతులు వెదురు, మునగ సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. సోమవారం మండలంలోని కొమరారం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పోడు రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోడు సాగుదారులు తమ చేనుల్లో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేయడం కంటే వెదురు, మునగ పంటలను సాగు చేయడం వల్ల శ్రమ, ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. పత్తి, మొక్కజొన్నకు విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికు వచ్చే వరకు యురియా, డీఎపీలు, పురుగుల మందులు వాడకం ఎక్కువ అవుతుందన్నారు. వెదురు, మునగ పంటలతో శ్రమ, పెట్టుబడి తక్కువని, ఆదాయం ఎక్కువగా ఉంటుందన్నారు. వెదురు తోటలు వేస్తే కొనుగోలుదారులు నేరుగా వచ్చి తీసుకువెళ్తారని సూచించారు. రైతులు ఇలాంటి పంటలపై దృష్టి సారించాలని కోరారు.
హాస్పిటల్ లో పనులకు ప్రతిపాదనలు పంపించండి
ఇల్లెందు ప్రభుత్వ హాస్పిటల్ లో సోమవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పనులకు ప్రతిపాదనలు పంపించాలని సిబ్బందికి సూచించారు. వైద్యశాలలోని లోతట్టు ప్రాంతాలలో వీలైనన్ని ఇంకుడు గుంతలను మున్సిపాలిటీ సహాయంతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఖర్చుతో కూడుకున్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ హస్పిటల్లలో ఏర్పాటు చేయటానికి ఎస్టిమేషన్ ఇవ్వాలని, వైద్యశాలలో స్ర్తీ, పురుషులకు ఓపి, ఫార్మసీల వద్ద వేరువేరుగా కౌంటర్స్ ఏర్పాటు చేయాలని, కావాల్సిన ఎస్టిమేషన్ వేసి తనకు పంపించాలన్నారు. చిన్న పిల్లల వార్డు, జనరల్ వార్డును సందర్శించి పేషెంట్స్ బాగోగులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. రవిబాబు, ఇల్లెందు సూపరింటెండెంట్ డా. హర్షవర్ధన్, వైద్యులు రాం నివాస్, తహసీల్దార్ కోట రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.