బీజేపీకి ఓపెనింగ్​లో దుబ్బాక.. చేజింగ్​లో చేగుంట

బీజేపీకి ఓపెనింగ్​లో దుబ్బాక.. చేజింగ్​లో చేగుంట
  •     చివర్లో ఆదుకున్న నార్సింగి
  •     బీజేపీ గెలుపులో కీలకంగా మూడు మండలాలు

సిద్దిపేట, మెదక్, వెలుగు: అచ్చు క్రికెట్ మ్యాచ్​ను తలపిస్తూ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది దుబ్బాక రిజల్ట్. బీజేపీకి దుబ్బాక మండలం మంచి ఓపెనింగ్ ఇస్తే చివరి రౌండ్లలో జరిగిన చేజింగ్ లో చేగుంట, నార్సింగి మండలాలు ఆదుకున్నాయి. దుబ్బాక బై ఎలక్షన్స్ లో అధికార టీఆర్​ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొదట్లో దుబ్బాక మండలం బీజేపీకి గట్టి పునాది వేయగా మధ్యలో పరిస్థితి కొంత టీఆర్​ఎస్​కు అనుకూలంగా మారింది. నంబర్​గేమ్​లో వెనుకబడిన బీజేపీని చివర్లో చేగుంట, నార్సింగి మండలాలు ఆదుకొని గెలుపుతీరానికి చేర్చాయి. ఈ బైఎలక్షన్స్​లో లక్షా 64వేల186 ఓట్లు పోల్ కాగా, 23 రౌండ్లలో లెక్కించారు. నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా మొదట నియోజకవర్గ కేంద్రం దుబ్బాక టౌన్​, రూరల్ మండల ఓట్లు లెక్కవెట్టిన్రు. ఫస్ట్ రౌండ్ నుంచే బీజేపీకి రిజల్ట్స్ అనుకూలంగా రావడం మొదలైంది. 5వ రౌండ్ వరకు బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. 10 రౌండ్లలో కలిపి బీజేపీ క్యాండిడేట్ రఘునందన్​రావు.. టీఆర్​ఎస్​ క్యాండిడేట్ సోలిపేట సుజాత కంటే 4 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక వరుసగా 14, 15, 16,17,18, 19 రౌండ్​లలో టీఆర్​ఎస్ క్యాండిడేట్​కు లీడ్ వచ్చి, బీజేపీ ఆధిక్యత తగ్గింది. 19వ రౌండ్​ పూర్తయ్యే సరికి టీఆర్​ఎస్ క్యాండిడేట్ దాదాపు 250 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. చివరగా మెదక్​ జిల్లా పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల్లో ఏ పార్టీకి మెజారిటీ ఓట్లు వస్తాయానే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ మండలాల ఓట్లను 20, 21, 22, 23  రౌండ్ లలోనూ బీజేపీకి లీడ్ రావడంతో రఘునందన్​ను విజయం వరించింది.