మహారాష్ట్ర వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన తెలంగాణ ఫ్యామిలీ

మహారాష్ట్ర వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన తెలంగాణ ఫ్యామిలీ

మహారాష్ట్రలోని ఉద్గిర్ దగ్గర  వరదల్లో  తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతవడం కలకలం రేపుతోంది. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు  కారుతో సహా వరద నీటిలో  కొట్టుకు పోయారు. వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలు జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని..తర్వాత స్విచ్ఛాప్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.  నలుగురు ఆచూకీ  కనిపెట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు గల్లంతైన వారి పిల్లలు, బంధువులు 

అసలేం జరిగిందంటే.?  జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో  పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ ఆగస్టు 17న  అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్ర లోని ఓ  వివాహానికి  వెళ్లి తిరిగి వస్తుండగా  ఉద్గిర్ దగ్గర  ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిలో అఫ్రీనాతో పాటు హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవర్ ఉన్నారు. వీరిలో సోహెబ్ ,  కార్ డ్రైవర్ వరద నీటి ప్రవాహం నుంచి ప్రాణాలతో బయటపడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టు సమాచారం.

 వరదలో కొట్టుకుపోయిన వారిలో  షేక్ అఫ్రీన్ తన భర్త సలీంకు ఫోన్ చేసి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నామని  పిల్లల్ని మంచిగా చూసుకోవాలని రోధిస్తూ చెప్పిందని, తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు .  వీళ్లంతా  నిజామాబాద్ బోధన్ కు సుమారు 150 కిలో మీటర్ల దూరంలోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్వగ్రామంలో ఉన్న పిల్లలు రాత్రి నుంచి తల్లి కోసం తల్లడిల్లుతోన్న ఘటన కంటతడి పెట్టిస్తోంది.  ఎలాగైనా వారిని తిరిగి తీసుకురావాలని  కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.