భూముల రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌కు  3 లక్షల అప్లికేషన్లు

భూముల రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌కు  3 లక్షల అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ కోసం మీసేవా కేంద్రాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 2014 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జారీ చేసిన జీవో 58, 59కు అనుగుణంగా.. భూముల అసైన్‌‌‌‌‌‌‌‌మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం అప్లికేషన్ పెట్టుకునేందుకు మరో అవకాశమిస్తూ సీఎస్‌‌‌‌‌‌‌‌ సోమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఫిబ్రవరి 14న జీవో 14ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గతంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుదారులతో పాటు కొత్త వాళ్లు అప్లై చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మార్చి 31తో ముగియనుంది. మరో ఐదు రోజులే గడువు ఉండడంతో మీసేవ కేంద్రాలు దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోతున్నాయి.

34 రోజుల్లో మూడు లక్షల అప్లికేషన్లు
జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తారు. ఇందుకోసం అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జీవో 58 కింద ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కోసం శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,49,437 అప్లికేషన్లు వచ్చాయి. జీవో 59 ప్రకారం భూముల రెగ్యులరైజేషన్​కు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా డబ్బులు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,51,406 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు వెయ్యి చొప్పున అప్లికేషన్ ఫీజుగా రూ.15.14 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా రెండు జీవోల కింద కలిపి అప్లికేషన్ల సంఖ్య మూడు లక్షలు దాటింది. మరో 5‌‌‌‌‌‌‌‌0 వేల అప్లికేషన్లు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గతంలోనూ 3.50 లక్షల దరఖాస్తులు
జీవో 58, 59 కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 2 లక్షల వరకు దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. 1.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండిపోయాయి.