సర్కారు సబ్సిడీ ఇవ్వక దళితుల పరిశ్రమలు ఖాయిలా

సర్కారు సబ్సిడీ ఇవ్వక దళితుల పరిశ్రమలు ఖాయిలా
  • రూ. 837 కోట్ల బకాయిలు పెండింగ్​
  • సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్న 19 వేల కంపెనీలు
  • 2018 నుంచి ఇదే పరిస్థితి.. ‘టీ ప్రైడ్’​ ఉత్తముచ్చట్నే
  • అప్పులు తీర్చలేక.. సిబ్బందికి జీతాలు 
  • ఇయ్యలేక.. వందకుపైగా ఫ్యాక్టరీలు మూత
  • బడ్జెట్‌‌లో ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తున్నా రిలీజ్​ చేయని సర్కార్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల పరిస్థితి దయనీయంగా తయారైంది. రాష్ట్రం ఏర్పడితే ఎంతో అభివృద్ధి చెందుతామని ఆశిస్తే.. నిరాశే ఎదురవుతోంది. చిన్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం లేదు. 2018 నుంచి  రూ. 837 కోట్ల సబ్సిడీ డబ్బులు రిలీజ్‌‌ చేయకుండా కాలం వెళ్లదీస్తోంది. రాష్ట్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం ‘టీ ప్రైడ్’ పేరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక విధానం తెచ్చింది. ఆర్భాటంగా ప్రచారం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల్లో  పురుషులకు 35 శాతం, మహిళలకు 45 శాతం సబ్సిడీలు అందిస్తామని చెప్పినా ఎక్కడా ఇవ్వట్లేదు..  


రూ.  75 లక్షల వరకు లిమిట్‌‌‌‌  పెట్టింది. దీంతో వేలాది మంది అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి ఇండస్ట్రీస్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. అప్పులు వచ్చినా.. ప్రభుత్వం నుంచి మాత్రం సబ్సిడీ రావడం లేదు. మూడేండ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఇట్లా ఇప్పటివరకు 19,792 పరిశ్రమలకు రూ. 837 కోట్ల సబ్సిడీ రావాల్సి ఉంది. వీటిలో ఎస్సీ పారిశ్రామిక వేత్తలవి 9,779..  ఎస్టీ పారిశ్రామిక వేత్తలవి 10,013 పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ఇప్పటికే వందకు పైగా మూతపడ్డాయి. మిగతావి కూడా మూతే పడే దశకు చేరుకున్నాయి. బడ్జెట్‌‌‌‌లో ఏటా ఎస్సీ, ఎస్టీలకు కలిపి సబ్సిడీ లోన్ల కోసం రూ. 300 కోట్లు కేటాయిస్తున్నా డబ్బులు మాత్రం రిలీజ్‌‌‌‌ చేయడంలేదు. ఈ నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం ఎప్పటికప్పుడు సబ్సిడీలు క్లియర్‌‌‌‌ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా అక్కడి ప్రభుత్వం ఇటీవల రూ. రూ. 1,200 కోట్లు ఒకే దఫాలో చెల్లించింది. 
ఎస్సీ, ఎస్టీల ఇండస్ట్రీస్‌‌‌‌కు ల్యాండ్‌‌‌‌ ఇస్తలేరు
తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్‌‌‌‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) కూడా ఎస్సీ, ఎస్టీలకు ప్లాట్ల కేటాయింపులోనూ అన్యాయం చేస్తోంది. టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో తప్పనిసరిగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం స్థలాలు కేటాయించాలని ఇండస్ట్రియల్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ జీవో నంబర్ 104 చెబుతోంది. కానీ అలా జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు చిన్నచిన్న ప్లాట్లు.. గుంతలు, రాళ్లు ఉన్న ప్లాట్లు.. పార్కుల చివర్లో మిగిలిపోయిన ప్లాట్లు ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చందనవల్లిలో 3 వేల ఎకరాల్లో రెండు పెద్ద పార్కులను అభివృద్ధి చేసిన టీఎస్ఐఐసీ.. ఎస్సీ, ఎస్టీలకు ఒక్క ప్లాట్ కూడా కేటాయించలేదు. హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఒక్క ప్లాటు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా ఇండస్ట్రీస్‌‌‌‌కు మౌలిక సదుపాయాలైన కరెంట్‌‌‌‌, వాటర్‌‌‌‌, రోడ్ల సౌలతులు కల్పించడంలేదని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పెరుగుతున్న వడ్డీలు.. బ్యాంక్‌‌‌‌ల వేధింపులు..
పరిశ్రమలు పెట్టేందుకు ఎంతో మంది డిగ్రీలు, పీజీలు చదివినవాళ్లు ముందుకు వస్తే.. సర్కారు మాత్రం మొండి చేయి చూపుతోంది. బ్యాంకుల్లో అప్పులు చేసి పరిశ్రమలు పెడితే.. సబ్సిడీ రాకపోవడంతో వాళ్లకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కిస్తీలు కట్టాలని బ్యాంక్‌‌‌‌ల నుంచి వేధింపులు పెరిగిపోతున్నాయి. నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. సబ్సిడీ డబ్బులు వస్తే లోన్లు తీర్చుకోవచ్చని భావిస్తే.. మూడేండ్లుగా సర్కారు మంజూరు చేయడం లేదు. గతేడాది కరోనాతో పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బపడింది. ఉత్పత్తులు తగ్గాయి. తయారైన ప్రొడక్ట్స్‌‌‌‌ నిలిచిపోయాయి. ఇటు సర్కారు నుంచి సబ్సిడీ రాక.. బ్యాంకుకు లోన్లు చెల్లించలేక పారిశ్రామిక వేత్తలు కుంగిపోతున్నారు. మెయింటనెన్స్‌‌‌‌, సిబ్బంది జీతాలు, కరెంట్‌‌‌‌ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా పరిశ్రమలకు బ్యాంకులు స్వాధీన నోటీసులు జారీ చేశాయి. కొన్ని చోట్ల పరిశ్రమలకు సీల్‌‌‌‌ కూడా వేశాయి. 2018 కంటే ముందు సర్కారు ఇచ్చిన సబ్సిడీ చెక్కుల్లో చాలా వరకు చెల్లలేదు కూడా. 


ఇది బాలానగర్‌‌‌‌లో మూతబడిన కార్టన్‌‌‌‌ డబ్బాల ఇండస్ట్రీ. టీ ప్రైడ్‌‌‌‌ కింద సబ్సిడీ వస్తుందని అప్పులు చేసి ఓ ఎస్సీ పారిశ్రామికవేత్త దీన్ని ప్రారంభించారు. సర్కారు నుంచి సబ్సిడీ రాక.. కరోనా వల్ల పనులు జరుగక తీవ్ర నష్టాల పాలయ్యారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో..  బిజినెస్‌‌‌‌ చేయలేక ఆఖరికి మూసేశారు. 


సబ్సిడీ వెంటనే అందించాలి
టీ ప్రైడ్‌‌‌‌ కింద ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీలు పత్తాలేకుండా పోయాయి. ఎంతో ఆశగా బ్యాంక్‌‌‌‌ల నుంచి అప్పులు తెచ్చి పరిశ్రమలు పెట్టుకుంటే సర్కారు సబ్సిడీలు ఇవ్వకపోవ డం దారుణం. ఏపీలో ఒక్క రూపాయి పారిశ్రా మిక సబ్సిడీలు పెండింగ్‌‌‌‌లో లేవు.  సర్కారు  సబ్సిడీ పైసలు రిలీజ్‌‌‌‌ చేయాలి. ప్లాట్ల కేటా యింపులపై టీఎస్ఐఐసీ రివ్యూ చేయాలి. 
                                                                                                          - మామిడి సుదర్శన్, నేషనల్‌‌‌‌ ప్రెసిడెంట్,   దళిత్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ అసోసియేషన్​

ఎందుకు ఇవ్వడం లేదు?
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎందుకు సబ్సిడీలు రిలీజ్​చేయడం లేదు? వేలమంది అప్పులు తెచ్చి, సబ్సిడీలు రాక నష్టాలపాలయ్యారు. మూడేండ్ల నుంచి సబ్సిడీలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయంటే ఎస్సీ, ఎస్టీలపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది.  వారి జీవితాలు ఆగం గాక  ముందే సబ్సిడీ ఇవ్వాలె.                                                                                                             - పి. శంకర్, జాతీయ కార్యదర్శి,    దళిత బహుజన ఫ్రంట్