న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో ఫీల్డ్డ్యూటీ చేసేందుకు తొలిసారి మహిళా ఆఫీసర్ అర్హత సాధించారు. ఫైర్ అండ్ ఫ్యూరీ సాపర్స్‌కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్.. సియాచిన్ గ్లేసియర్‌లోని కుమార్ పోస్ట్‌లో డ్యూటీ చేస్తున్నారని ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ ట్వీట్ చేసింది. ట్విట్టర్లో సంబంధిత ఫొటోలు పోస్ట్ చేస్తూ ‘అన్ని అడ్డంకులను బద్దలు కొడదాం’ అనే క్యాప్షన్ పెట్టింది.
సియాచిన్‌లో 15,632 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్‌లో ఎముకలు కొరికే చలి ఉంటుంది. శ్వాస కూడా సరిగా ఆడదు. ఏడాదిలో 365 రోజులూ ఇదే పరిస్థితి ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేని విధంగా మంచు ఉంటుంది. కుమార్ పోస్ట్‌లో పోస్ట్ చేయడానికి ముందు శివ చౌహాన్ కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారని ఆర్మీ తెలిపింది.