సెన్సెక్స్ @ 76,000..లైఫ్​ టైం హైకి నిఫ్టీ

సెన్సెక్స్ @ 76,000..లైఫ్​ టైం హైకి నిఫ్టీ

ముంబై :  మార్కెట్​చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్ సోమవారం 76,000 స్థాయిని అందుకుంది. అయితే నిఫ్టీ చివరి 30 నిమిషాల ట్రేడ్‌‌‌‌లో ప్రాఫిట్​బుకింగ్​ కారణంగా సూచీలు నష్టాల్లో ముగిశాయి.   30 షేర్ల బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 19.89 పాయింట్లు క్షీణించి 75,390.50 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఇది 599.29 పాయింట్లు పెరిగి 76,009.68 ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.  ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో లాభాలను బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు.  ఇండెక్స్ ఇంట్రాడే హై నుంచి 835 పాయింట్లు క్షీణించి 75,175.27 కనిష్ట స్థాయికి చేరుకుంది.

నిఫ్టీ 24.65 పాయింట్లు శాతం పడి 22,932.45 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 153.7 పాయింట్లు పెరిగి 23,110.80 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. అయినప్పటికీ, ఆయిల్, ఎనర్జీ,  ఎఫ్‌‌‌‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల కారణంగా పడిపోయింది.  ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 1 శాతం క్షీణించింది. దీంతో బెంచ్ మార్క్ సూచీలకు నష్టం తప్పలేదు.  ఈ ఏడాది  ఏప్రిల్ 9న తొలిసారిగా సెన్సెక్స్ 75,000 మార్కును అధిగమించింది. ఈ బెంచ్‌‌‌‌మార్క్ 1,000 పాయింట్లు ఎగబాకి సోమవారం 76,000 మార్కును చేరుకోవడానికి 31 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.

మార్చి 6న 74,000 స్థాయిని తాకిన తర్వాత ఏప్రిల్ 9న 75,000 మార్కును చేరుకోవడానికి సెన్సెక్స్​ 21 ట్రేడింగ్ సెషన్‌‌‌‌లను తీసుకుంది.  సెన్సెక్స్ సంస్థల నుంచి, విప్రో, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఐటీసీ,  రిలయన్స్  వెనుకబడ్డాయి. అయితే  ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాల్లో ఉన్నాయి.  

ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై  హాంకాంగ్ సానుకూలంగా స్థిరపడ్డాయి.  యూరప్‌‌‌‌ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం లాభాలతో ముగిసింది.