వరి వద్దనడంతో రైతుల బలవన్మరణం

వరి వద్దనడంతో రైతుల బలవన్మరణం
  • పంట అమ్ముడుపోక, అప్పులు తీరక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు
  • యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు బలవన్మరణం
  • పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడుతున్న కుటుంబాలు
  • 36.66 లక్షల మంది రైతులకు అమలు కాని రుణమాఫీ 
  • పంట నష్టపోయినా సర్కారు నుంచి అందని పరిహారం
  • ఈ ఏడాది ఇప్పటి వరకు వెయ్యి మంది ఆత్మహత్య

హైదరాబాద్​/ నెట్​వర్క్​, వెలుగు: నలుగురికి అన్నం పెట్టే రైతుల ఇండ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నయి. అప్పుల బాధలకు తోడు ఎవుసంపై లీడర్ల ఒడువని పంచాది ఆ మట్టిమనుషులను అరిగోస పెడుతున్నది. పంట పండించడం తప్ప వేరే తెలియని అన్నదాతలు అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నరు. పంట దిగుబడి రాక కొందరు.. కొనుగోళ్లు జరగక ఇంకొందరు.. యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు.. ఇట్ల గడిచిన రెండున్నర నెలల్లోనే రాష్ట్రంలో 206 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. పెద్ద దిక్కును కోల్పోయి ఆ అన్నదాతల కుటుంబాలు రోడ్డునపడుతున్నయి. 

పంట అమ్ముకునేందుకు తిప్పలు
వానాకాలంలో పండిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కొనకపోవడం వల్లే ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు. వానాకాలంలో సుమారు 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 6,821 కొనుగోలు సెంటర్ల ద్వారా కోటి 3 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇందులో కేంద్రం ప్రభుత్వం 60 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సెప్టెంబర్​లోనే అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం 43  లక్షల టన్నులు మాత్రమే. ఇందులో ఈ 15 రోజుల టైంలోనే సగం ధాన్యం తీసుకున్నారు. వారం కిందటి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రొక్యూర్​మెంట్​ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. 10 శాతం వడ్లు కూడా కొనకముందే వడ్ల కొనుగోళ్లపై లీడర్ల పంచాయితీ షురూ అయింది. దీంతో కొనుగోళ్లను పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది. దసరా, దీపావళి నుంచే వడ్లు మార్కెట్​లోకి రావడం మొదలైనా కొనుగోళ్లు జరగక రైతులు తిప్పలు పడ్డారు. ఇప్పటికీ పెద్దగా కొనుగోళ్లు జరగడం లేదు. 

వడ్లు కొంటలేరని.. 
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన బేతల్లి కుమార్​(45) అక్టోబర్​ మొదటివారంలో వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిండు. తేమ ఎక్కువుందని అధికారులు చెప్పడంతో అక్కడే ఆరబోసిండు. మూడు రోజులకే పూర్తిగా ఎండినా.. నేడు, రేపు అంటూ నిర్వాహకులు కాంటా పెట్టలేదు. దీంతో మనస్తాపం చెందిన బేతల్లి కుమార్​ అదే నెల 21న వడ్ల కుప్ప వద్దే పురుగు మందు తాగి ప్రాణాలు వదిలిండు. సెంటర్లకు వడ్లు తెచ్చిన రైతులు వారాలు, నెలల తరబడి అక్కడే ఎదరుచూడాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ఆందోళన చెందిన కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

అప్పుల ఊబిలో కూరుకుపోయి..
ఎవుసంలో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నా ఆ మేరకు దిగుబడులు రాక రైతులు క్రమంగా అప్పుల ఊబిలో కూరకపోతున్నారు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పంటలు సాగుచేస్తున్నా, పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదు. ఈసారి పత్తికి మంచి రేటు ఉన్నప్పటికీ, వర్షాలతో పత్తి పూర్తిగా దెబ్బతిని దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు కనీసం 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే 3 క్వింటాళ్లే వచ్చింది. కొన్నేండ్లుగా ఇదే పరిస్థితి. దీంతో నాలుగైదు ఎకరాలు సాగుచేసే బడుగు రైతుల్లో ఒక్కొక్కరి నెత్తిపై రూ. 10 లక్షలకు తక్కువ కాకుండా అప్పు ఉంటోందని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. దీనికి తోడు పిల్లల చదువులు, వారి పెండ్లిళ్లు, ఇతరత్రా ఖర్చులు కూడా కలిసి రుణభారం తడిసిమోపడైతున్నది. అప్పు తీర్చే మార్గం కనిపించని రైతులు తీవ్ర ఒత్తిడికి గురై, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు తీవ్ర డిప్రెషన్​లోకి వెళ్లి రోగాలపాలై చనిపోతున్నారు. గడిచిన మూడేండ్లలో వివిధ కారణాలతో 74 వేల మంది రైతులు ప్రాణాలొదిలినట్లు  రైతుబీమా లెక్కలే చెప్తున్నాయి. ఇందులో పదోవంతుకుపైగా ఆత్మహత్యలే ఉంటున్నాయని, రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమని రైతు సంఘాల నాయకులు, అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంటున్నారు. 

రుణమాఫీ అమలవ్వక..!
2018 డిసెంబర్​ 11వరకు ఉన్న క్రాప్ లోన్లు( వడ్డీ, అసలు కలిపి) రూ. లక్ష వరకు  మూడేండ్లలో మాఫీ చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన రాష్ట్ర సర్కారు.. దాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా​40.66 లక్షల  రైతులకు సంబంధించి రూ.25,936 కోట్ల క్రాప్​లోన్స్​ ఉండగా, గడిచిన మూడేండ్లలో కేవలం 4 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 732.24 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 25,203 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. దీంతో ఆ అప్పు మాఫీ కాక, బ్యాంకుల్లో కొత్త అప్పు పుట్టక, అధిక మిత్తికీ ప్రైవేటులో తెచ్చుకుని తిరిగి తీర్చలేక మనస్తాపంతో రైతులు ప్రాణాలు వదులుతున్నారు. 

పంటనష్టపోయినా పరిహారం ఇస్తలే..!
భారీ వర్షాలతో పంటలు దెబ్బతినడం, వరదల్లో కొట్టుకపోవడం, చీడపీడల వల్ల దిగుబడి తగ్గడం లాంటి కారణాల వల్లే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సీజన్​లో ఇన్​పుట్​సబ్సిడీ కింద నష్ట పరిహారం అందజేయాలి. కానీ టీఆర్ఎస్  అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తప్ప ఇన్​పుట్​ సబ్సిడీ కింద ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గడిచిన మూడేండ్లుగా రైతులు భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్దమొత్తంలో పంటలు నష్టపోయారు.  2020 – 21 వానకాలం సీజన్​లో భారీ వర్షాలు, వరదల కారణంగా  25 లక్షలకుపైగా ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్లే రిపోర్టులు పంపినా సర్కారు ఏ ఒక్కరికీ ఇన్​పుట్​సబ్సిడీ ఇవ్వలేదు. ఇలాంటి సమయాల్లో రైతులను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమా పథకంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు. దీంతో కనీసం బీమా కంపెనీల నుంచి కూడా రాష్ట్ర రైతులకు పరిహారం అందట్లేదు. ఫలితంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు భారీ వర్షాలు, వరదలకు కండ్ల ముందే కొట్టుకుపోతుంటే ఆదుకునే దిక్కులేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 

చుట్టుముడుతున్న సమస్యలు
అప్పుల బాధలకు తోడు సెంటర్లలో వడ్లు పోసి వారాలు గడుస్తున్నా సర్కారు కొనకపోవడం, యాసంగిలో వరి సాగు వద్దనడం,  ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలో తెలియకపోవడం, తరతరాలుగా సాగుచేస్తున్న అసైన్డ్​ భూములను ప్రభుత్వం గుంజుకోవడం, హరితహారం కింద పోడుభూముల్లో మొక్కలు నాటడం, ధరణి వల్ల ల్యాండ్​ఇష్యూస్​ పెరగడం, నెలల తరబడి తిరుగుతున్నా కరెక్షన్స్​కాకపోవడం లాంటి కారణాలతో రైతులు ప్రాణాలు వదులుతున్నారు. వానాకాలంలో ప్రభుత్వం చెప్పినట్లు సన్నవడ్లు సాగు చేసినా దిగుబడి రాక, గిట్టుబాటు కాక మెదక్​ జిల్లా బొగుడ భూపతిపూర్​కు చెందిన కరణం రవి కుమార్​ అనే రైతు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలంలో వరి తప్ప వేరే పంట పండదని, ఇప్పుడు వరి సాగు చేయొద్దంటే ఎట్లా బతికేదని ఆయన సీఎం కేసీఆర్​కు లెటర్​ రాసి పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. తాత ముత్తాతల నుంచి తాము సాగు చేసుకుంటున్న అసైన్డ్​భూమిని రైతు వేదిక కోసం తీసుకున్నారన్న ఆవేదనతో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకు చెందిన దళిత రైతు బ్యాగరి నర్సింలు నిరుడు జులైలో ఆత్మహత్య 
చేసుకున్నాడు. 

తెలంగాణ వచ్చినప్పటి నుంచి 7,409 మంది రైతుల ఆత్మహత్య
నేషనల్​ క్రైమ్​ బ్యూరో ఆఫ్​ రికార్డ్స్​ లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏడేండ్లలో రాష్ట్రంలో  7,409 మంది రైతులు సూసైడ్​ చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతు సంఘాల అంచనా. ఇక  రాష్ట్ర ప్రభుత్వం 60 ఏండ్లలోపు ఉన్న రైతులకు బీమా అమలు చేస్తున్నది. ఈ  లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 7,358 మంది రైతులు చనిపోయారు. ఇందులో సాధారణ మరణాలు, యాక్సిడెంట్లు, పాము కాటు వంటివి తీసేస్తే ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 10 నుంచి 15 శాతం వరకు ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు.

గిట్టుబాటు ధరపై ఎందుకు ఎనక్కైతున్నరు
పంటకు పెట్టుబడి ఇస్తున్నమని చెప్పుకుంటున్న సర్కార్​ మిగతావన్నీ మరిచిపోయింది. గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఎందుకు ఎన్కకు అయితున్నరు. వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొంటే ఏమైతది. గోడౌన్లు లేవు.. అదీ లేదు.. ఇదీ లేదు అని ఇప్పుడు చెప్తున్నరు. మొన్నటి దాకా 40 లక్షల టన్నులకు గోదాముల సామర్థ్యం పెంచుకున్నమని ప్రకటించు కున్నరు కదా? 
- మల్లారెడ్డి, రైతు సంఘం నాయకులు

రుణ మాఫీ చేయాలి
రైతుల మరణాలు, ఆత్మహత్యలకు రాష్ట్ర సర్కార్​దే బాధ్యత. గిట్టుబాటు, మార్కెటింగ్​ సౌకర్యాలు, వాల్యూ అడిషన్ ​రైతులకు అందాలి. పంటలకు నష్టాలకు పరిహారం ఇయ్యాలి. ఫసల్​ బీమా కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇంకో బీమా తీసుకురావాలి. గిట్టుబాటు ధరకు పంట అమ్ముకునే సౌకర్యం రైతులకు కల్పించాలి.  లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. ప్రైవేటుల వడ్డీ భారం పెరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరు. 
- కొండల్​రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక

ఆందోళనగా ఉంది
నిరుడు సన్నవడ్లు ఎక్కువేయమంటే పంట దిగుబడి మొత్తం పోయి రైతులు నష్టపోయిన్రు. ఈ వానాకాలం పత్తి ఎక్కువెయ్యుమేంటే దిగుబడి మొత్తం పోయింది. వానాకాలం వడ్ల కొనుగోళ్ల జాప్యంతో కుప్పలమీద రైతులు చనిపోతున్నరు. వచ్చే యేడు కోటి ఎకరాలు పత్తేయమంటున్నరు. ఇంకెన్ని ఆత్మహత్యలు పెరుగుతాయోనని ఆందోళనగా ఉంది. ఏ పంట  ఎక్కువైనా రైతుకు ఇబ్బందే. 
- కన్నెగంటి రవి, కన్వీనర్‌, రైతు స్వరాజ్యవేదిక

వారం రోజుల్లోనే..!

  • మెదక్‌‌ జిల్లా హవేలి ఘనపూర్‌‌ మండలం బొగుడ భూపతిపూర్‌‌ కు చెందిన కరణం రవికుమార్​ (40)  ఈ నెల 10న సీఎం కేసీఆర్​కు లెటర్​ రాసి  సూసైడ్​ చేసుకున్నాడు. సన్నరకం వడ్లకు మద్దతు ధర లేదని, ప్రభుత్వం వరి వేయవద్దంటే మరేం చేయాలని లెటర్​లో పేర్కొన్నాడు. 
  • సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని చంద్రనాయక్ తండాకు చెందిన కౌలు రైతు బానోతు రమేశ్(24) ఈ నెల 12న అప్పుల బాధతో పురుగుల మందు తాగి చనిపోయాడు. వర్షాలకు పత్తి పంట దెబ్బతినగా.. వరి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. తీరా పంటను కొనుగోలు కేంద్రంలో అమ్ముకునే పరిస్థితి లేక రమేశ్​ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
  • మహబూబాబాద్‌‌ జిల్లా దూద్యాతండాకు చెందిన ఆంగోతు బిక్కు (50)  పంట దిగుబడి రాక అప్పులు పెరగడంతో కలత చెంది ఇటీవల  ఉరివేసుకున్నడు.
  • దుబ్బాక మండలం చిట్టాపూర్​ గ్రామానికి చెందిన చౌడం స్వామి(53) అనే రైతు అప్పుల బాధతో ఈ నెల 11న ఆత్మహత్య చేసుకున్నాడు.