వాతావరణ మార్పుల గురించి లైవ్‌‌గా ట్వీట్లు

వాతావరణ మార్పుల గురించి లైవ్‌‌గా ట్వీట్లు

వాతావరణాన్ని అంచనా వేయడం అంత ఈజీ కాదు.  దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది.  కానీ, ఒక చెట్టు ఆ పనిని ఎంతో సులువుగా చేసేస్తుంది. ఎప్పటికప్పుడు క్లైమెట్ అప్‌‌డేట్స్ ఇవ్వడంతో పాటు వాతావరణ మార్పుల గురించి లైవ్‌‌గా ట్వీట్లు కూడా చేస్తుంది.

ప్రకృతిని మనుషుల కంటే చెట్లు, జంతువులే ఎక్కువగా అర్థం చేసుకోగలవు. అందుకే వాతావరణాన్ని అంచనా వేయడం కోసం చెట్ల సాయం తీసుకుంటున్నారు యూఎస్‌‌లోని హార్వర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్. యూఎస్‌‌లోని పీటర్‌‌షామ్ ఫారెస్ట్ మధ్యనున్న 87 అడుగుల పొడవైన ‘నార్తర్న్ రెడ్ ఓక్ ట్రీ’ వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు  లైవ్ ట్వీట్ చేస్తుంటుంది.  

వాతావరణంలో ఉష్ణోగ్రతలు మార్పులను రికార్డ్ చేసేందుకు ఈ చెట్టుకు చుట్టూ సెన్సర్లతో వైరింగ్ చేశారు. అయితే ఇవి వెదర్ రిపోర్ట్ చేసే సెన్సర్లు కావు. ఈ సెన్సర్లు చెట్టు ఆరోగ్యంతో పాటు, చెట్టులోని ద్రవాల్లో వస్తున్న మార్పులను గమనిస్తుంటాయి. చెట్ల ఆకులను ఫొటోలు తీస్తుంటాయి. ఉష్ణోగ్రతలను బట్టి చెట్టు ఆరోగ్యం ఎలా మారుతుందో ఇవి తెలుసుకుంటాయి. దాన్నిబట్టి గ్లోబల్ వార్మింగ్‌‌ను ఒక అంచనా వేస్తారు సైంటిస్టులు. అలాగే ఈ చెట్టు రికార్డ్ చేసిన డేటా ‘విట్‌‌నెస్ ట్రీ’ అనే ట్విట్టర్ పేజీలో ఆటోమెటిక్ గా పోస్ట్ అవుతుంటుంది. ఈ రెడ్ ఓక్ ట్రీకి సుమారు వందేళ్ల వయసుంటుంది. ఈ చెట్టు వాతావరణ మార్పులకు తట్టుకుని బతకగలదు. అందుకే  ఎక్స్‌‌పరిమెంట్ కోసం ఈ చెట్టును ఎంచుకున్నట్టు సైంటిస్టులు చెప్తున్నారు.