హసీనా షాక్​లో ఉన్నరు... ఆలోచించుకోవడానికి ఆమెకు టైమ్ ఇచ్చాం: జైశంకర్

హసీనా షాక్​లో ఉన్నరు... ఆలోచించుకోవడానికి ఆమెకు టైమ్ ఇచ్చాం: జైశంకర్
  • బంగ్లాదేశ్ లోని మనోళ్ల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా షాక్​లో ఉన్నారని, భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచించుకోవడానికి ఆమెకు కొంత సమయం ఇచ్చామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్ లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. మంగళవారం పార్లమెంట్ హౌస్ లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లోని పరిస్థితులపై ప్రతిపక్ష నేతలకు జైశంకర్ వివరించారు. అలాగే రాజ్యసభలోనూ బంగ్లాదేశ్ ఇష్యూపై ఆయన ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసిన తర్వాత భారత్ కు రావడానికి పర్మిషన్ ఇవ్వాలని షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు.

ఫ్లైట్ క్లియరెన్స్ కు అప్రూవర్ కోరుతూ అక్కడి అధికారులు రిక్వెస్ట్ పంపారు. సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు” అని జైశంకర్ వెల్లడించారు. హసీనా భారత్ కు వచ్చి 24 గంటలు కూడా కాలేదని, ఆమె షాక్ లో ఉన్నారని, భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇచ్చామని తెలిపారు. బంగ్లాదేశ్ లో ఉన్న మనోళ్ల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ లో 19 వేల మంది ఇండియన్స్ ఉంటున్నారు. వీరిలో 9 వేల మంది విద్యార్థులు. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ జులైలోనే ఇండియాకు వచ్చేశారు. అక్కడున్న మనోళ్లకు భద్రత కల్పించాలని ఢాకా అధికారులను కోరాం. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం” అని జైశంకర్ పేర్కొన్నారు. 

విదేశీ కుట్రపై విచారణ.. 

ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా కేంద్రానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు వేశారు. బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందా? ముఖ్యంగా పాక్ కుట్ర ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. దీనికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బదులిస్తూ.. ఆ కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ ఆందోళనలకు మద్దతుగా పాకిస్తాన్ డిప్లొమాట్ ఒకరు తరచూ తన సోషల్ మీడియా డీపీ మారుస్తున్నారని పేర్కొన్నారు. దీని వెనుక ఏదైనా ఉందా? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు.

ఇక బంగ్లాదేశ్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాలని అనుకుంటున్నారని రాహుల్ ప్రశ్నించగా.. అక్కడి పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నామని జైశంకర్ బదులిచ్చారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో కేంద్రానికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. మద్దతు తెలిపినందుకు ప్రతిపక్ష పార్టీలను జైశంకర్ అభినందించారు. ఆల్ పార్టీ మీటింగ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్, హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (జేడీయూ), కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి (జేడీఎస్), టీఆర్ బాలు (డీఎంకే), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ) సుదీప్ బండోపాధ్యాయ (టీఎంసీ) తదితరులు పాల్గొన్నారు.