ఇండియా నుంచి 27 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు వెనక్కి

ఇండియా నుంచి 27 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు వెనక్కి
  • రూ.27 వేల కోట్ల విలువైన షేర్ల అమ్మకం 

న్యూఢిల్లీ: యూఎస్ ఫెడరల్​ రిజర్వ్ ​పోయిన నెల 21 న వడ్డీరేట్లను 75 బేసిస్​ పాయింట్లను పెంచగా, అప్పటి నుంచి ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు (ఎఫ్​ఐఐలు) ఇండియా మార్కెట్ల నుంచి రూ.27 వేల కోట్ల విలువైన ఇన్వెస్ట్​మెంట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో సెన్సెక్స్​ బలహీనంగా మారింది. ఆనాటి నుంచి 1,500 పాయింట్లు నష్టపోయింది.

జులై,  ఆగస్టు మినహా, 2022 క్యాలెండర్ సంవత్సరంలోని అన్ని నెలల్లో ఎఫ్​ఐఐలులు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో రూ. 1,76,247 కోట్లుగా ఉంది. ఫెడ్ పెంపు తర్వాత 3 సందర్భాలలో మాత్రమే దలాల్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు భారీగా షేర్లు కొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబరులో, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐ అమ్మకాలలో ఎక్కువగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఫైనాన్షియల్స్, రియల్టీ  పవర్ వంటి 6 రంగాల షేర్లు ఉన్నాయి. సెప్టెంబరులో దాదాపు రూ. 9,200 కోట్ల అవుట్​ఫ్లో వల్ల ఐటీ స్టాక్‌‌‌‌‌‌‌‌లు చాలా నష్టాలను ఎదుర్కొన్నాయి. దేశీయ మార్కెట్ల నుంచి బలమైన పెట్టుబడులు లేకుంటే, సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ మరింత బలహీనపడి ఉండేదని ఎనలిస్టులు అంటున్నారు. అయితే గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు రెండింతలు పెరిగి రూ.14 వేల కోట్లకు చేరాయి.

అనేక గ్లోబల్ ఈక్విటీ సూచీలు బేర్ గ్రిప్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, నిఫ్టీ మాత్రం తక్కువగానే నష్టపోయింది. ‘‘ బలమైన దేశీయ ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతీయ మార్కెట్లు చాలా నిలకడగా ఉన్నాయి. క్రెడిట్ గ్రోత్, పర్సనల్ లోన్ గ్రోత్, జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కలెక్షన్స్, ఆటో అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి” అని పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన సుర్జిత్ సింగ్ అరోరా అన్నారు.

గ్లోబల్​ మార్కెట్ల ఇబ్బందుల నుండి వచ్చే నష్టాలను తోసిపుచ్చలేనప్పటికీ, భారతదేశ మార్కెట్లు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాయని అన్నారు. గత 12 నెలల్లో, గ్లోబల్ మార్కెట్ క్యాప్ 22.3శాతం తగ్గినా, ఇండియా కంపెనీల మార్కెట్​-క్యాప్ 4.3శాతం మాత్రమే పడింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే భారతదేశం వాల్యుయేషన్ ప్రీమియం 100 శాతం పైగా ఉండటం ఇబ్బందేనని అరోరా వివరించారు. అధిక ముడి చమురు ధరలు, రూపాయి తగ్గుదల, ప్రపంచ మందగమనం,  చైనా రికవరీ కారణంగా గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బోఫా సెక్యూరిటీస్ ఇటీవల నిఫ్టీ టార్గెట్​ను18,500 నుండి 17,500 కు తగ్గించింది.