
ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను గ్లోబల్ అంశాలు ప్రభావితం చేయనున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) ట్రేడింగ్ యాక్టివిటీపై ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఐలు శుక్రవారం సెషన్‌లో నికరంగా రూ.1,790 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. మరోవైపు డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 1,237 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ వారం మంత్లీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరి ఉండడంతో మార్కెట్‌లో వోలటాలిటీ కనిపించొచ్చని ఎనలిస్టులు పేర్కొన్నారు.
దేశంలో కురస్తున్న వర్షాలు, బ్రెంట్ క్రూడాయిల్ ధర వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అన్నారు. బడ్జెట్‌కు సంబంధించిన వార్తలు వస్తుండడంతో ఈ వారం కొన్ని సెక్టార్ల షేర్లు తీవ్రంగా కదలొచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అన్నారు. ఎఫ్‌ఐఐలు, డీఐఐల కదలికలు, క్రూడాయిల్ ధరను జాగ్రత్తగా గమనించాలని ట్రేడర్లకు ఆయన సలహా ఇచ్చారు. యూఎస్ జీడీపీ డేటా జూన్ 27 న విడుదల కానుంది. కిందటి వారం సెన్సెక్స్ 217 పాయింట్లు (0.28 శాతం), నిఫ్టీ 35 పాయింట్లు (0.15 శాతం) లాభపడ్డాయి.