విదేశీ మెడికోలకు తిప్పలు .. ఎఫ్‌‌ఎంజీ ఎగ్జామ్ పాస్ కాలేక తంటాలు

విదేశీ మెడికోలకు తిప్పలు .. ఎఫ్‌‌ఎంజీ ఎగ్జామ్ పాస్ కాలేక తంటాలు
  • చాటుగా ప్రైవేటు హాస్పిటళ్లలో ఉద్యోగాలు
  • వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే చర్యలు తీసుకుంటున్న మెడికల్  కౌన్సిల్
  • అండర్ గ్రాడ్యుయేట్లుగా మిగిలిపోతున్న వేల మంది
  • ఫారిన్​కు వద్దు.. దేశంలోనే చదివించాలని డాక్టర్ల సూచన

హైదరాబాద్, వెలుగు: నీట్ రాసిన స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల చుట్టూ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు చక్కర్లు కొడుతున్నాయి. విదేశాల్లో అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్  సీట్లు ఇప్పిస్తామని తల్లిదండ్రులను ఏజెంట్లు మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ఏజెన్సీల మాయలో పడి ఏటా మన రాష్ట్రం నుంచి 3 వేల నుంచి 4 వేల మంది స్టూడెంట్లు విదేశాల్లో ఎంబీబీఎస్‌‌‌‌  చదివేందుకు వెళ్తున్నారు. కానీ, ఇందులో సగం మంది అండర్‌‌‌‌ ‌‌‌‌గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోతున్నారు.

ఆయా దేశాల్లో ఎంబీబీఎస్  పట్టా అందుకున్నా.. ఇక్కడికొచ్చాక నేషనల్  బోర్డు నిర్వహించే ఫారిన్  మెడికల్  గ్రాడ్యుయేట్స్‌‌‌‌ ఎగ్జాం (ఎఫ్ఎంజీఈ) పాస్ కాలేకపోతున్నారు. ఈ ఎగ్జామ్ పాస్  కాకుంటే, విదేశాల నుంచి తెచ్చుకున్న ఎంబీబీఎస్  పట్టా పనికిరాదు. ఆ పట్టాతో ఇక్కడ డాక్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రాక్టీస్  చేయడానికి వీలుండదు. చివరి ఐదు ఎఫ్‌‌‌‌ఎంజీ ఎగ్జామ్స్‌‌‌‌లో కనీసం ఒక్కసారి కూడా పాస్ పర్సంటేజీ 30 శాతం దాటలేదు.

దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్  చదివిన వేల మంది అటు డాక్టర్లు కాలేక, ఇటు ఇంకే వృత్తికీ నోచుకోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. చాలా దేశాల్లో మెడికల్  విద్య ఒక వ్యాపారంగా మారిపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్ని విదేశాల్లో ఎంబీబీఎస్‌‌‌‌  చదివించదల్చుకున్న తల్లిదండ్రులు.. ఏజెంట్లు చెప్పే మాటలు విని మోసపోవద్దని సూచిస్తున్నారు.

ఇప్పటికే ఆయా దేశాల్లో చదివి వచ్చిన స్టూడెంట్ల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చెబుతున్నారు. మన దేశంలోనే లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, పిల్లల్ని ఇక్కడే చదివించాలని సూచిస్తున్నారు.

ఎఫ్‌‌‌‌ఎంజీఈ మస్ట్‌‌‌‌

విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చాక ఎఫ్‌‌‌‌ఎంజీఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌‌‌‌ పాస్ అవకుండా డాక్టర్‌‌‌‌‌‌‌‌గా నేషనల్  మెడికల్  కౌన్సిల్  నుంచి, స్టేట్  మెడికల్  కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్‌‌‌‌ పొందలేరు. కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌  దేశాల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే ఎఫ్‌‌‌‌ఎంజీఈ నుంచి మినహాయింపు ఉంది. ఆ దేశాల్లో వైద్యవిద్య ప్రమాణాలు భారత్ లో కన్నా బాగుంటాయని, అక్కడి చదివినోళ్లకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు.

మిగతా ఏ దేశంలో చదివినా ఎఫ్‌‌‌‌ఎంజీఈ పాస్‌‌‌‌  కావాల్సిందే. ఎఫ్‌‌‌‌ఎంజీఈ పాస్‌‌‌‌ అయ్యాక ఇండియాలోనే ఏడాదిపాటు ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌  చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌  పూర్తి చేస్తేనే డాక్టర్‌‌‌‌‌‌‌‌గా నేషనల్  మెడికల్  కౌన్సిల్ (ఎన్‌‌‌‌ఎంసీ) గుర్తింపు ఇస్తుంది. అప్పుడే స్టేట్ మెడికల్  కౌన్సిల్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, డాక్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత వస్తుంది. 

మధ్యలోనే వదిలేస్తున్నారు

ఏటా జూన్, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో నేషనల్‌‌‌‌ బోర్డు ఆఫ్‌‌‌‌ ఎగ్జామినేషన్స్‌‌‌‌ (ఎన్‌‌‌‌బీఈ) ఎఫ్‌‌‌‌ఎంజీఈ పరీక్ష నిర్వహిస్తుంది. 300 మార్కులకు నిర్వహించే ఈ ఎగ్జామ్‌‌‌‌లో కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకుంటేనే పాస్  అయినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. చాలా మంది ఈ ఎగ్జామ్‌‌‌‌  పాస్  కాలేక తిప్పలు పడుతున్నారు. 2014  నుంచి 2018 వరకు 64,647 మంది పరీక్ష రాస్తే, 8,917 మంది మాత్రమే పాసయ్యారు. 2019 నుంచి పాస్‌‌‌‌ పర్సంటేజ్ 20 నుంచి 30 మధ్యే ఉంది. ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేక వందల మంది తమ చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు.

కొంత మంది  ప్రైవేటు, కార్పొరేట్‌‌‌‌  హాస్పిటల్స్ లో అత్తెసరు జీతానికి క్లినికల్‌‌‌‌ అసిస్టెంట్లుగా, డ్యూటీ మెడికల్  ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఇది కూడా దొంగచాటు ఉద్యోగమే. ఇలా చేస్తూ దొరికితే హాస్పిటల్‌‌‌‌పై, ఆయా వ్యక్తులపై కఠిన చర్యలకు మెడికల్  కౌన్సిల్, హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌  సిద్ధమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రిమినల్  కేసులు కూడా పెడుతున్నారు.

భవిష్యత్తు ఉండదు.. 

తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్‌‌‌‌  అనే స్లోగన్స్ చూసి పేరెంట్స్‌‌‌‌ తొందర పడొద్దు. ఇప్పటికే నాసిరకం కాలేజీల్లో చదివొచ్చి, ఎఫ్‌‌‌‌ఎంజీఈ క్లియర్ చేయలేక వేలమంది ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా నెక్ట్స్‌‌‌‌ రాబోతుంది. ఎఫ్‌‌‌‌ఎంజీఈ కన్నా నెక్ట్స్‌‌‌‌ ఇంకా టఫ్ గా ఉండవచ్చు. ఒకవేళ ఈ ఎగ్జామ్‌‌‌‌  పాస్  కాకపోతే పిల్లల భవిష్యత్తు  ఎటూకాకుండా పోతుంది.

ఇవన్నీ పేరెంట్స్  దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఐదేండ్లలో మన దేశంలో, రాష్ట్రంలో మెడికల్  కాలేజీలు, ఎంబీబీఎస్  సీట్ల సంఖ్య చాలా పెరిగింది. లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లు దేశంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో 8 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. పిల్లలు కొంచెం కష్టపడితే ఇక్కడే సీటు వస్తుంది.

 డాక్టర్ విజయేందర్‌‌‌‌‌‌‌‌ గౌడ్,

పాలియేటీవ్  కేర్ స్పెషలిస్ట్, బసవతారకం హాస్పిటల్