ఫారెస్ట్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్లు..పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ గ్రీన్ సిగ్నల్

ఫారెస్ట్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్లు..పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ గ్రీన్ సిగ్నల్
  • ఆర్వో ఎఫ్ఆర్ పట్టాలున్న లబ్ధిదారులకు నో అబ్జెక్షన్
  • కలెక్టర్, డీఎఫ్ వో చొరవతో తొలగుతున్న అడ్డంకి
  • సిర్పూర్ (టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీతోపాటు మరికొన్ని చోట్ల లబ్ధిదారులకు ఊరట

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు:  ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ అడ్డంకులు తొలగి ఇండ్ల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గతంలో  రిజర్వ్ ఫారెస్ట్ భూమి అంటూ అధికారులు అడ్డుచెప్పడంతో ఇండ్ల నిర్మాణం నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇండ్ల నిర్మాణం సాగలేదు. 

ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులు, ముఖ్యంగా గిరిజన కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, డీఎఫ్​వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ చొరవతో ఫారెస్ట్ ఆఫీసర్లు కొంత వరకు సడలింపు ఇచ్చారు. మొదట ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలున్న వారు ఇండ్లు కట్టుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో నాలుగైదు రోజులుగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గులు పోసుకోవడం, చదును చేసుకునే పనులు వేగంగా జరుగుతున్నాయి.

పది నెలల నిరీక్షణకు తెర

ఇందిరమ్మ ఇండ్ల మొదటి ఫేజ్​లో పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేశారు. ఈ మేరకు జనవరి 26 నాడు ఊరిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సిర్పూర్ (టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీలోని మేడిపల్లి, లింబుగూడ, రావణ్ పల్లి గ్రామాల్లో 150 ఇండ్లు మంజూరు చేశారు. ఇందులో రావణ్ పల్లికి ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో ఇండ్ల నిర్మాణం కొనసాగింది. 

మేడిపల్లి, లింబుగూడ రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలోకి వస్తుందని అప్పటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఎంపీడీవోకు నోటీసులు ఇచ్చారు. దీంతో రెండు గ్రామాల్లో 130 ఇండ్ల నిర్మాణం ముగ్గు వేయకుండానే ఆగిపోయింది. అప్పటి నుంచి లబ్ధిదారులు, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్సీ, కలెక్టర్, డీఎఫ్​వోను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బెజ్జూర్ మండలం పాటన్​పేట్, పెంచికల్ పేట్ మురళిగుడా, కాగజ్ నగర్ మండలం మానిక్ ఫటార్ ఈ గ్రామాల్లోనూ ఈ సమస్య ఉంది. దీంతో ప్రభుత్వం సైతం ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టింది.

పోడు పట్టాలున్న వారికి ముందుగా పర్మిషన్

పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో పనులు ముందుకు సాగకపోవడం, ఫారెస్ట్ క్లియరెన్స్ అడ్డుగా ఉండడంతో ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం సమస్యను ఇన్ చార్జ్ మంత్రి, హౌసింగ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్ కు, డీఎఫ్​వోకు ఆదేశాలు వచ్చాయి. దీంతో వారం క్రితం కలెక్టరేట్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి సమస్యను కొలిక్కి తెచ్చేలా చేశారు. 

సాధ్యమైనంత వరకు నిరుపేదలకు ఇండ్ల నిర్మాణంలో సహకారం అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇండ్లు ఉన్న చోటనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చర్యలు చేపడతామని పంచాయితీ రాజ్, హౌసింగ్ రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్లకు  వివరించారు. దీంతో మొదట ఆర్వో ఎఫ్​ఆర్ పట్టాలున్న లబ్ధిదారులకు ఇండ్లు కట్టుకోవచ్చని ఫారెస్ట్​ఆఫీసర్లు పర్మిషన్​ఇచ్చారు. అడ్డంకి తొలగడంతో కొందరు లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గులు వేశారు.

అందరికీ పర్మిషన్ ఇవ్వాలి

పోడు భూముల పట్టాలున్న వారు ఇల్లు కట్టుకోవచ్చని అనుమతివ్వడం ఆనందంగా ఉంది. కానీ ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలున్నవారికే కాకుండా అందరికీ అనుమతి ఇవ్వాలి. మేమంతా ఇక్కడే పుట్టి పెరిగాం. ఊరిలో అందరికీ పర్మిషన్ ఇచ్చి ఇండ్లు నిర్మాణానికి సహాయం చేయాలి. ఊరికి మంజూరైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు కూడా  పర్మిషన్ ఇవ్వాలి. - సూర్పం మారు, రాజ్ గోండు సేవా సమితి కాగజ్​నగర్ డివిజన్ అధ్యక్షుడు