కొత్తరకం రెస్ట్ ఇన్ పీస్: అడవి చెట్లకు అస్తికల సమాధి

కొత్తరకం రెస్ట్ ఇన్ పీస్:  అడవి చెట్లకు అస్తికల సమాధి

ఐడియా ఉండాలే గాని దేన్నైనా బిజినెస్‌‌గా మార్చుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా శాన్‌‌ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్ కంపెనీ అడవిలోని చెట్లను అమ్మకానికి పెట్టింది. చెట్లను కొనుక్కొని ఏం చేస్తారనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి!

మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలి అనుకుంటారు వాళ్ల కుటుంబ సభ్యులు. అందుకే చనిపోయిన తర్వాత మెమోరియల్‌‌గా ఒక చిన్న సమాధి కట్టిస్తారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభా వల్ల మనుషులు ఉండడానికే చోటు లేదు. అలాంటిది సమాధులకి చోటు ఎక్కడిది? అందుకే ఈ మధ్య కాలంలో ఒకప్పటిలా సమాధులు కట్టుకోవడం తగ్గిపోయింది.  అందరికీ కలిపి ఒకటే క్రిమేషన్ యార్డ్. ఎవరినైనా చితిమీద కాల్చేసి బూడిద (చితాభస్మం) చేతికిచ్చి పంపిస్తారు. దానిని తీసుకెళ్లి ఏదో ఒక నదిలో కలిపేయాలి. అంతే అక్కడితో మేటర్ క్లోజ్.

తరాల వరకు
కానీ ఈ కొత్త కాన్సెప్ట్‌‌తో మనిషి చనిపోయిన తరువాత సమాధి రూపంలో కాకుండా ఒక చెట్టు రూపంలో అతడి జ్ఞాపకాలను  పదిలంగా దాచుకోవచ్చు. ఒకప్పుడు చనిపోయిన తర్వాత సమాధి పై ఒక తులసి చెట్టు నాటే వాళ్లు. చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆ చెట్టులో ఉంటుందని కొందరి నమ్మకం. అదే కాన్సెప్ట్‌‌తో ఇప్పుడు అమెరికాలోని ‘బెటర్ ప్లేస్ ఫారెస్ట్స్’ అనే  స్టార్టప్ కంపెనీ.. చెట్టును  చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థంగా ఉంచుకునేందుకు అడవిలోని చెట్లను అమ్ముతుంది. తులసి మొక్క అయితే కొంత కాలానికి చనిపోతుందేమో కానీ, ఈ అడవిలోని చెట్లు మాత్రం వందల ఏళ్ల కొద్దీ అలాగే ఉంటాయి. ఒక్కో  రెడ్‌‌వుడ్ చెట్టు సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఏళ్ల వరకు బతుకుతుంది. అంటే ఒక ఫ్యామిలీకి ఏడు తరాలన్న మాట. ఈ రకంగా ఒక చెట్టుని కొనుక్కుంటే ఏడెనిమిది తరాల వరకు అది మన ఫ్యామిలీకి,  ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికి జ్ఞాపకార్థంగా మిగిలిపోతుంది.

అడవిని కొనేసి..
‘బెటర్ ప్లేస్ ఫారెస్ట్స్’ కంపెనీ వాళ్లు సిలికాన్ వ్యాలీలోని ఒక ఫారెస్ట్‌‌ని కొని, అందులోని చెట్లని పరిరక్షిస్తుంటారు. ఆ అడవి మీద , అడవిలోని చెట్ల  మీద పూర్తి హక్కులు వీళ్లు తీసుకుంటారు. అడవిలోని ప్రతి అడుగూ శుభ్రపరచి, ప్రతీ చెట్టు దగ్గరకి నడిచి వెళ్లే విధంగా దారులు ఏర్పాటు చేశారు. ప్రతి చెట్టుని నీట్‌‌గా రెడీ చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. ఇక్కడ చిన్నచిన్న మొక్కల నుంచి ఆకాశాన్నంటేలా పెరిగిన పెద్ద పెద్ద చెట్ల వరకు రకరకాల సైజుల్లో.. అన్ని చెట్లూ ఉంటాయి.

జ్ఞాపకార్థంగా..
కావాలనుకున్న వాళ్లు నచ్చిన  చెట్టుని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకసారి మొక్కను కొన్నాక అది పూర్తిగా వారిదే అవుతుంది. వాళ్లవి, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌‌వి అందరి అస్తికలు  చెట్టు మొదల్లో కలిపి, ఆ చెట్టుని వాళ్లకు వారసత్వ చెట్టుగా మార్చుకోవచ్చు, దీన్ని కేవలం జ్ఞాపకార్థంగా మాత్రమే ఉపయోగించుకోవాలి.  కొమ్మలు నరికేయడానికి, పూర్తిగా కొట్టేయడానికి అనుమతి లేదు.

అస్తికలతో ప్రాణం పోసి..
వ్యక్తి మరణించిన వెంటనే వాళ్ల  బూడిదని తీసుకొచ్చి కంపెనీ వాళ్లకిస్తే.. వాళ్లు ముందుగా రిజిస్టర్ చేసుకున్న చెట్టు మొదల్లో మూడు అడుగుల లోతు ఒక కందకం తవ్వి,  చెట్టు వేర్ల దగ్గర అస్తికలు కలుపుతారు. ఒకవేళ అది అప్పుడే పెరుగుతున్న చిన్న మొక్క అయితే మొక్క చనిపోకుండా మనిషి బూడిదతోపాటు  అందులో ఆల్కలైన్ , సోడియం కూడా కలిపి, దాన్ని చెట్టుకి ఎరువుగా మారుస్తారు. పెద్ద చెట్టు అయితే అవేమీ అవసరంలేదు.

ఒక్క సారి చెట్టుని కొన్నాక వాళ్ల ఫ్యామిలీలోని అందరి అస్తికలు ఆ చెట్టు కింద కలుపుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్‌‌తో పాటు  పెంచుకునే పెట్ చనిపోతే.. దాని అస్తికలు  కూడా కలుపుకోవచ్చు. కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే ఆ అనుమతి ఉంది. ఒకవేళ  రిజిస్టర్ చేసుకున్న చెట్టు చనిపోతే అదే ప్లేస్‌‌లో కొత్త చెట్టు నాటుతారు.

నిజమైన రెస్ట్
ఇలా ఒక చెట్టుని కొనుక్కున్న తర్వాత ఎప్పుడైనా మెమోరియల్ డే రోజు వచ్చి ఆ చెట్టు దగ్గర టైం గడపొచ్చు. ఇలా అడవిలో భాగం అవడం వల్ల ఎంతో ప్రశాంతత లభిస్తుంది. చనిపోయిన వారి ఆత్మ కూడా శాంతిస్తుంది అని అక్కడి వాళ్లు చెప్తున్నారు.  “మామూలుగా  గ్రేవ్ యార్డ్ అంటే  భయానికి , నెగెటివ్ ఎనర్జీకి సింబాలిక్‌‌గా ఉంటుంది. ఇది మాత్రం అలా కాదు. ఎంతో ప్రశాంతమైనది. రెస్ట్ ఇన్ పీస్‌‌కి ఇది నిజమైన నిర్వచనం” అంటున్నాడు ‘బెటర్ ప్లేస్ ఫారెస్ట్’ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శాండీ గిబ్సన్.

ప్రాసెస్ ఇలా..
ఈ కంపెనీ తరపున కొన్ని అడవులు ఉంటాయి. మొదటగా  మీకు ఏ అడవి కావాలో ఎంచుకోవాలి. తీరం వెంబడిదా? పర్వతాల్లో ఉండేదా?  ఇలా ఎలాంటి లొకేషన్‌‌లో మీ అడవి ఉండాలనేది మీరే నిర్ణయించుకోవాలి.

అడవిని నిర్ణయించుకున్నాక  మీకు ఏ చెట్టు కావాలో  ఎంపిక చేసుకోవాలి. శాంతా క్రూజ్, రెడ్ వుడ్ ఇలా చాలా రకాల చెట్లు ఉంటాయి అడవిలో.  జీవిత కాలాన్ని బట్టి  చెట్టుని ఎంచుకోవచ్చు.

ఎంచుకున్న చెట్టు దగ్గర ఒక ఫలకంపెట్టి దాని మీద మీ పేరు ముద్రిస్తారు. అస్థికలను చెట్ల వేళ్లలో కలపడం ద్వారా ఎంచుకున్న చెట్టు.. మీ వారసత్వపు చెట్టుగా మారిపోతుంది.   మీ చెట్టుని పూర్తిగా క్షేమంగా చూసుకునే బాధ్యత కంపెనీ వాళ్లది.

ధరలు

అప్పడే పెరుగుతున్న మొక్క అయితే మూడు వేల డాలర్ల నుంచి ఆరువేల డాలర్ల వరకూ ఉంటుంది. కాస్త పెరిగినవి ఐతే.. ఏడువేల డాలర్లు, మరీ ఎత్తుగా పెరిగిన రెడ్ వుడ్ చెట్లయితే.. పది నుంచి పదిహేను వేల డాలర్ల వరకూ ఉంటాయి.

మొదటిసారి చెట్టుని కొన్న వాళ్లను ఫౌండర్స్ అంటారు. ప్రతి ఫౌండర్ మొదటి చెట్టుని నమోదు చేసుకున్న తరవాత వాళ్ల పేరు  మీద మరో  వంద నుంచి ఐదొందల వరకు కొత్త మొక్కలు కాలిఫోర్నియా సిటీలో నాటుతారు.

డిజిటల్ కనెక్టివిటీ కూడా..
కావాలనుకుంటే.. మీకు సంబంధించిన వీడియోలను కూడా చెట్టు దగ్గర  ఉన్న డిజిటల్ యూనిట్స్‌‌లో సేవ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్లు ఇచ్చిన కార్డ్ ద్వారా ఆ డిజిటల్ యూనిట్‌‌కి  కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా చెట్టు దగ్గరకి వచ్చినప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ల వీడియోలు, ఫొటోలు చూసుకోవచ్చు. వాటిని ఎవరూ ఓపెన్ చేయకుండా ప్రైవసీ లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. చెట్టుని మెమోరియల్‌‌గా మార్చుకునేందుకు చాలామందే ఆసక్తి చూపుతున్నారని,  బతికుండగానే చాలామంది తమ చెట్టుని సెలెక్ట్ చేసుకున్నారని గిబ్సన్ చెప్తున్నాడు. ఇప్పటికే వెయ్యికి పైగా చెట్లు అమ్ముడయ్యాయట.. ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్లు, వయసు పైబడిన వాళ్లు ముందుగానే చెట్టుని రిజిస్టర్ చేసుకుంటున్నారంట.