అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకునేదెలా?

 అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకునేదెలా?
  • ఆపసోపాలు పడుతున్న ఫారెస్ట్ అధికారులు
  • కమ్యూనిటీ ఫారెస్ట్ కింద వెదురు పెంపకానికి సై
  • తద్వారా ఆదివాసీలకు ఆదాయ కల్పనకు ప్లాన్
  • మాకు భూములే కావాలంటున్న ఆదివాసీలు 
  • దండేపల్లి, జన్నారం మండలాల్లో ఆక్రమణలు  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో అటవీ భూముల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు కొట్టి పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకుంటున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు చేస్తున్న ప్రయత్నాలు వృథా అవుతున్నాయి. ఆక్రమణదారులపై చట్ట ప్రకారం కేసులు పెట్టినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని ఫారెస్ట్​ ఆఫీసర్లు ముందుకు వచ్చినా ససేమిరా అనడం ఇబ్బందిగా మారింది. సున్నితమైన అంశం కావడంతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

దండేపల్లి, జన్నారం మండలాల్లో.. 

కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దండేపల్లి, జన్నారం మండలాల్లో కొంతకాలంగా అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. జన్నారం రేంజ్ పరిధి పాలగోరి అటవీ ప్రాంతంలో సిర్పూర్(యూ), లింగాపూర్, కెరమెరి మండలాలకు చెందిన పలువురు ఆదివాసులు ఫారెస్ట్ భూములను ఆక్రమించుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ తమ పూర్వీకులు నివాసం ఉన్నారంటూ ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు పలుమార్లు గుడిసెలు తొలగించినప్పటికీ అక్కడి నుంచి కదలకుండా భీష్ముంచుకున్నారు.

 అక్కడ భూములు ఆక్రమించుకున్న వారికి వారి గ్రామాల్లో పట్టా భూములు ఉన్నట్టు ఎంక్వైరీలో తేలింది. దీంతో పోలీసుల సహకారంతో గుడిసెలు తొలగించి ఆదివాసీలను వెనక్కి పంపించడంలో సక్సెస్ అయ్యారు. ఇదే తరహాలో తాళ్లపేట్ రేంజ్ పరిధిలోని దమ్మన్నపేట, మామిడిగూడెం గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసీలు రిజర్వ్ ఫారెస్టులోకి చొరబడ్డారు. దాదాపు వంద ఎకరాల్లో చెట్లు కొట్టి భూములను ఆక్రమించుకున్నారని అధికారులు చెబుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నేటికీ ఫారెస్ట్ భూముల్లో చెట్లు కొట్టి ఆక్రమణలు కొనసాగిస్తున్నారని అధికా రులు పేర్కొంటున్నారు.

కమ్యూనిటీ ఫారెస్ట్​కు నో.. 

రిజర్వ్ ఫారెస్ట్ భూములను కాపాడడంతో పాటు భూమి లేని ఆదివాసులకు ఉపాధి కల్పించాలని అధికారులు కమ్యూనిటీ ఫారెస్ట్ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఆక్రమిత భూముల్లో వెదురు ప్లాంటేషన్ ఏర్పాటు చేసి దానిపై వచ్చే ఆదాయాన్ని ఆదివాసీ గిరిజనులకే చెందేలా చూస్తామని హామీ ఇచ్చారు, ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ గిరిజనులు అందుకు ఒప్పుకోలేదు. ఆక్రమిత భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తు న్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. 

ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలు

ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్ ద్వారా 2005కు ముందు నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం పట్టాలు జారీ చేస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫారెస్ట్ భూములను ఆక్రమించుకుంటూ పట్టాల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే టైగర్ రిజర్వ్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షా 30 వేల ఎకరాల భూములు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. మరో లక్షా 20 వేల ఎకరాలకు పట్టాలు జారీ చేశారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో సుమారు 2.5 లక్షల ఎకరాల్లో అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో టైగర్ జోన్ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.