రైతులు పంటలేయకుండా అడ్డుకుంటున్న ఆఫీసర్లు

రైతులు పంటలేయకుండా అడ్డుకుంటున్న ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు:45 ఏండ్ల క్రితం పట్టాలిచ్చిన భూములపై  ఫారెస్ట్ ఆఫీసర్లు కిరికిరి పెడుతున్నారు. ఆ భూములు తమ శాఖవేనని రైతులు పంటలు వేయకుండా అడ్డుకుంటున్నారు.  ఎవరైనా పంటలేస్తే కేసులు పెడతామని భయపెడుతున్నారు.  ఇప్పటికే కొన్నిచోట్ల మార్కింగ్‌‌ చేసి హద్దు రాళ్లను పాతారు. వారం క్రితం హరితహారం మొక్కలు నాటేందుకని గుంతలు తీసేందుకు కూడా యత్నించారు.  రైతులు అడ్డుకొని జేసీబీలను తిప్పి పంపించారు.  ఎన్నడూ లేనిది కొత్త పంచాయితీ ఏంటని, వానాకాలం సీజన్‌‌ టైమ్‌‌లో ఇబ్బందులు పెడితే ఏడాదంతా నష్టపోతామని 
వాపోతున్నారు.

210 ఎకరాలకు పట్టాలు

పాలమూరు జిల్లా మహ్మదాబాద్​ మండలం నంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్663లో మొత్తం 466 ఎకరాల భూమి ఉంది. ఇందులో 210 ఎకరాల్లో ఉన్న పోరంబోకు, అసైన్డ్​, లావాని భూములను గ్రామానికి చెందిన 60 మంది రైతులకు 1977లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది.  మిగతా 256 ఎకరాల భూమి ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ పరిధిలో ఉంది.  ప్రస్తుతం 210 ఎకరాలకు సాగునీరు లేకపోవడంతో రైతులు వానాకాలం పంటలు సాగు చేసుకుంటున్నారు.  2018లో వీరికి రాష్ట్ర ప్రభుత్తం కొత్త పీపీబీలు జారీ చేసింది. రైతుబంధు పైసలు కూడా వీరి అకౌంట్లో జమ చేస్తోంది.  కానీ,  ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ భూములు తమవేనని మూడు నెలలుగా రైతులను గోస పెడుతున్నారు. ధరణిలో 256 ఎకరాల భూమి ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​దే అని చూయిస్తున్నా.. ఆఫీసర్లు  అదనంగా మరో 32 ఎకరాలకు కూడా తమదే అంటున్నారు. ఇందుకు సంబంధించిన డిజిటల్​ సర్వే మావద్ద ఉందంటూ చెబుతున్నారు.  ఈ భూమిలో  మొక్కలు నాటాలని పై నుంచి ఆర్డర్లు వచ్చాయని చెబుతున్నారు.  అయితే, రెవెన్యూ డిపార్ట్​మెంట్​వద్ద కూడా ఈ సర్వే నంబర్​కు సంబంధించిన ఆర్​వోఆర్​ అందుబాటులో లేదు. దీన్ని ఆధారంగా చేసుకొని స్థానిక ఫారెస్ట్​ ఆఫీసర్లు రైతులను పొలాల్లోకి రానివ్వకుండా అడ్డకుంటున్నారు. 

జాయింట్​ సర్వే చేస్తలేరు

ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​భూముల పంచాయతీలను తేల్చేందుకు ఆఫీసర్లు జాయింట్​సర్వేలు చేస్తలేరు. దీంతో ప్రతి ఏడాది వానాకాలం టైంలో ఫారెస్ట్​ ఆఫీసర్లు రైతులను వేధిస్తున్నారు. గతేడాది ఇదే టైంలో గండీడ్​ మండలం రుసుంపల్లి వద్ద పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను అడ్డుకున్నారు.  కానీ, వారు అడ్డం తిరగడంతో  వెళ్లిపోయారు. అలాగే మహ్మదాబాద్​ మండలం అన్నారెడ్డిపల్లి, బాపన్​కుంటతండా, తంగాయపల్లి తండా, ధర్మాపూర్​, గాధిర్యాల్​ గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉంది. 1992లో ఇదే మండలంలో ఓ రైతుకు చెందిన భూమి తమదే అంటూ 
ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డు తగిలారు. దీంతో సదరు రైతు హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆఫీసర్లు సైలెంట్ అయిపోయారు. తాజాగా ఇప్పుడు నంచర్ల వద్ద ఉన్న భూములు మావంటూ ఆఫీసర్లు హంగామా చేస్తున్నారు. 

రైతుల నుంచి డబ్బులు లాగేందుకు యత్నం

ఈ వ్యవహారంలో నంచర్ల గ్రామానికి చెందిన ఒక టీఆర్​ఎస్​ లీడర్​, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు చెందిన ఓ ఆఫీసర్​తో జత కలిసినట్లు తెలిసింది. ఇద్దరూ రైతుల నుంచి ఎకరాకు రూ.10 వేల చొప్పున డబ్బులు వసూలు చేసుకునేందుకు ప్లాన్​ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  పైసలు ఇచ్చిన వారికి సెటిల్​మెంట్​ చేసి వారి భూముల జోలికి రాకుండా ఉంటామని హామీ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే సదరు టీఆర్​ఎస్​ లీడర్​ కొందరు రైతులతో డబ్బుల కోసం సంప్రదింపులు కూడా చేసినట్లు టాక్​ నడుస్తోంది. దీనికితోడు సదరు ఫారెస్ట్​ ఆఫీసర్​ సోమవారం ఫీల్డ్​విజిట్​కు వచ్చిన తహసీల్దార్ పట్ల అసభ్యంగా మాట్లాడినట్లు బాధిత రైతులే చెబుతున్నారు. 

రైతులు ఎవరికీ పైసలివ్వొద్దు

సర్వే నంబర్​ 663కు సంబంధించి రైతులు లీడర్లు, ఆఫీసర్లకు రూపాయి ఇవ్వనవసరం లేదు. అలా ఎవరన్నా అడిగితే, నా దృష్టికి తీసుకురండి. 663 సర్వే నంబర్​కు సంబంధించి వారం క్రితం సర్వే చేయించినం. రిపోర్ట్​ ఇంకా రాలేదు. అలాగే ఎడీ ఎస్​ఎల్​ఆర్​ చేయించాలని కలెక్టర్​ను కోరినం. జాయింట్​ ఇన్​పెక్షన్ కూడా చేస్తం. బౌండరీ ఫినిషింగ్​ కోసం రెవెన్యూ అడిషనల్​ కలెక్టర్‌‌‌‌ను కలుస్తం.
- ఆంజనేయులు, తహసీల్దార్, మహ్మదాబాద్