- మున్సిపాలిటీ ఎన్నికల్లో 20 వార్డులు గెలవాలి
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: మేడారం మహాజాతర ప్రారంభోత్సవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం ములుగు క్యాంపు ఆఫీస్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టగా, పనులు పూర్తిచేసుకొని ముఖ్యమంత్రి చేతులమీదుగా పున:ప్రారంభించుకుందామన్నారు.
కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరై సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవాలన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న మన్సిపాలిటీ ఎన్నికల్లో ములుగులో 20 వార్డులు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు
ఉంటుందన్నారు.
మహిళా సంఘాల స్టాల్స్ ప్రారంభం..
ములుగు, మల్లంపల్లి మండలాల్లో మంత్రి సీతక్క పలు మహిళా సంఘాల స్టాల్స్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన టీ స్టాల్, జంగాలపల్లి క్రాస్ వద్ద బొంగు చికెన్, నాటు కోళ్ల అమ్మకం, కూరగాయలు, పండ్లు విక్రయించే స్టాల్స్ ను మంత్రి ప్రారంభించి, మేడారం జాతర భక్తులకు టీ అందజేశారు. జాతరతో పాటు అన్ని ప్రధాన రూట్లలో మహిళా సంఘాల చేత స్టాల్స్ ఏర్పాటు చేయించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. అనంతరం మల్లంపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడారు.
మేడారం జాతర నేపథ్యంలో ట్రాఫిక్ పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా బ్రిడ్జి పనులు పూర్తిచేసి జాతరకు అందించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యుడు మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్‌రెడ్డి, పంచాయతీరాజ్డైరెక్టర్ బైరెడ్డి భాగవాన్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకండి..
తాడ్వాయి : మేడారం జాతరలో ప్లాస్టిక్‌ని వాడకండని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం మేడారం జాతర అటవీ ప్రాంతంలో ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "ప్లాస్టిక్ ను వాడకండి. పర్యావరణాన్ని పరిరక్షించండి" అనే గోడపత్రిక, "జాతరకు వచ్చే భక్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకండి" అనే కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్‌నాథ్ సుధీర్ కేకన్, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, సభ్యులు పాల్గొన్నారు.
