- ఈజీ పద్ధతిలో పని కాకుంటే.. కఠిన మార్గంలోనైనా తీసుకుంటం
- గ్రీన్లాండ్ ప్రజలకు ఇష్టమున్నా, లేకున్నా విలీనం తప్పదు
- మేం స్వాధీనం చేసుకోకుంటే.. ఆ పనిని రష్యా లేదా చైనా చేస్తాయి
- అవి తమ పొరుగు దేశాలు కావడం ఇష్టంలేదన్న యూఎస్ ప్రెసిడెంట్
- పుతిన్‌ను ఎత్తుకురావాల్సిన అవసరం లేదని కామెంట్
వాషింగ్టన్: ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్‌లాండ్‌ను తాము ఎలాగైనా సరే విలీనం చేసుకుంటామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. సులభంగా పని జరగకపోతే.. బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటామన్నారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో వెనెజువెలా నుంచి ప్రయోజనాలు పొందే అంశంపై ఆయిల్ ఎగ్జిక్యూటివ్స్‌తో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘గ్రీన్లాండ్ ప్రజలకు ఇష్టమున్నా, లేకపోయినా మేం ఆ పని చేయబోతున్నాం. నేను ఒక డీల్ ను ఆఫర్ చేస్తాను. ఒకవేళ ఈజీ పద్ధతిలో జరగకపోతే.. కఠినమైన మార్గంలోనైనా విలీనం చేసుకుంటాం” అని ట్రంప్ చెప్పారు.
అపార ఖనిజ సంపద ఉన్న గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా సైనిక కార్యకలాపాలు పెరిగాయని.. గ్రీన్‌లాండ్‌ను తాము స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని రష్యా లేదా చైనా చేస్తాయన్నారు. ఆ రెండు దేశాలు పొరుగున ఉండటం తమకు ఇష్టంలేదన్నారు. అందుకే కష్టమైన పద్ధతిలోనైనా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామన్నారు. తన నిర్ణయాన్ని డెన్మార్క్ వ్యతిరేకించడంపై ట్రంప్ స్పందిస్తూ.. ‘‘నేను డెన్మార్క్‌కు అభిమానిని. వాళ్లు కూడా నాతో చాలా మంచిగా ఉంటారు. అయితే, 500 ఏండ్ల క్రితం వాళ్లు పడవను నిలిపినంత మాత్రాన.. ఆ ప్రాంతం వారికి సొంతం అయిపోదు” అని కామెంట్ చేశారు. అయితే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే వారం డెన్మార్క్ విదేశాంగ మంత్రి, గ్రీన్లాండ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారని ట్రంప్ తెలిపారు. కాగా, 57 వేల మంది జనాభా
ఉన్న గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ సైనిక రక్షణలో స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగంగా కొనసాగుతోంది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటివరకూ రష్యా గానీ, చైనా గానీ ప్రకటించలేదు.
పుతిన్‌ను ఎత్తుకురావాల్సిన అవసరం లేదు..
ఇటీవల వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను ఎత్తుకొచ్చినట్టుగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కూడా అమెరికా బలగాలు బంధించి తీసుకెళ్తాయంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. పుతిన్ తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయనను బంధించి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఉక్రెయిన్ యుద్ధంపై తాను చాలా అసంతృప్తికి గురయ్యానని తెలిపారు. ‘‘నేను 8 యుద్ధాలను ఆపాను. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్నీ ఈజీగా ఆపుతాననుకున్నా. కానీ ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుండటంపై చాలా డిసప్పాయింట్ అవుతున్నా” అని ట్రంప్ చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు సంబంధించి పుతిన్‌పై ది హేగ్ లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల మదురోను అమెరికా బలగాలు బంధించి తీసుకొచ్చిన తర్వాత జెలెన్ స్కీ స్పందిస్తూ.. ‘‘నెక్స్ట్ పుతిన్ వంతే” అని కామెంట్ చేశారు.
మేం గ్రీన్లాండర్స్గానే ఉంటాం: గ్రీన్లాండ్ నేతలు
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ప్రకటనలను గ్రీన్లాండ్ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ‘‘మేం అమెరికన్లుగానే, డేన్స్(డెన్మార్క్ ప్రజలు)గానో ఉండాలని కోరుకోవడం లేదు. మేం గ్రీన్ లాండర్స్ గానే ఉంటాం”అని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ శుక్రవారం రాత్రి స్పష్టం చేశారు. గ్రీన్లాండ్లోని నాలుగు రాజకీయ పార్టీల నాయకులు కూడా ట్రంప్ ప్రకటనలను ఖండించారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటామని తేల్చిచెప్పారు. కాగా, ట్రంప్ ప్రకటనను నాటో కూటమిలో భాగస్వామిగా ఉన్న డెన్మార్క్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా గ్రీన్‌లాండ్‌ను ఆక్రమిస్తే తూటాలతో బదులిస్తామని.. చివరకు ఈ చర్య నాటో కూటమి అంతానికి దారి తీస్తుందని డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ హెచ్చరించారు.
