- ఎస్ఐ పొంతన లేని సమాధానాలు
- తెలియదు.. గుర్తుకులేదు..
- మీరే వెతకండి అంటూ సమాధానం
- చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఎస్ఐ
హైదరాబాద్, వెలుగు: అంబర్‌పేట పాత ఎస్‌ఐ భానుప్రకాశ్ రెడ్డి సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారింది. లాడ్జిలో మర్చిపోయానని ఒకసారి.. బస్సులో పోయిందని మరోసారి చెప్పుకుంటూ వచ్చిన భాను ప్రకాశ్.. చివరకు తెలియదు, గుర్తులేదు, మీరే వెతికి తీసుకోండి.. తాకట్టు పెట్టినట్టు తెలిస్తే రికవరీ చేసుకోండి అంటూ పోలీసులను ముప్పతిప్పలు పెడ్తున్నట్టు తెలిసింది. అయితే, ఎంక్వైరీలో భాగంగా సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకునేందుకు అన్ని కోణాల్లో విచారించినా ఫలితం దక్కలేదని సమాచారం. దీంతో గత నెలలో భానుప్రకాశ్‌ను రిమాండ్‌కు తరలించారు. కానీ, రివాల్వర్ ఎక్కడుందో ఇంతవరకూ పోలీసులు కనిపెట్టలేకపోయారు. మరోవైపు రాష్ట్ర పోలీసులు రివాల్వర్ మిస్సింగ్‌పై ఇటు అన్ని జిల్లాలతో పాటు ఏపీ, కర్నాటక పోలీసులు సహా ఇతర రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారు. 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్ ఎక్కడైన లభిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.
నెల రోజులపాటు చుక్కలు చూపించిండు..
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.2 కోట్లు కోల్పోయిన అంబర్‌పేట్ పీఎస్ మాజీ డిటెక్టివ్ ఎస్‌ఐ భానుప్రకాశ్.. చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో గ్రూప్1 ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాక ఎన్‌వోసీ కోసం వచ్చి.. రివాల్వర్ సరెండర్ చేయకపోవడంతో దొరికిపోయాడు. పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాదాపు నెల రోజుల పాటు భానుప్రకాశ్‌ను ప్రశ్నించారు. సర్వీస్ రివాల్వర్‌ను గుర్తించే క్రమంలో భానుప్రకాశ్‌ను అన్ని కోణాల్లో ప్రశ్నించారు. కాగా, రివాల్వర్‌ను తాకట్టు పెట్టుకున్నాడని మొదట్లో ప్రచారం జరిగినా.. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఎక్కడ పోయిందో తెలియదు
ఏపీ గ్రూప్ 1 పరీక్షల సమయంలో భానుప్రకాశ్ సెలవుపై వెళ్లాడు. ఆ సమయంలో విజయవాడలోని ఓ లాడ్జిలో ఉన్నాడు. పరీక్షలకు సిద్ధమవుతూనే కర్నూల్, రాయచోటి సహా ఏపీలోని పలు ప్రాంతాలకు జర్నీ చేసినట్టు పోలీసులకు చెప్పాడు. మొదట్లో విజయవాడ లాడ్జిలో మిస్ అయిందని చెప్పాడు. ఆ తర్వాత బస్సు జర్నీలో ఎక్కడో పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. భానుప్రకాశ్ చెప్పిన వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో సిటీ పోలీసులు తనిఖీలు చేశారు. కానీ, రివాల్వర్ జాడ మాత్రం చిక్కలేదు. చివరికి తాకట్టు పెడితే రికవరీ చేయండి, మిస్సింగ్ కాబట్టి మీరే వెతికండి అనే సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో భాను ప్రకాశ్ చెప్పేది నిజమో.. అబద్ధమో తేల్చలేక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
