- బహిరంగ సభను సక్సెస్ చేయాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: సీపీఐ వందేండ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వామపక్ష పార్టీల అగ్ర నాయకులు, 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు.
సీపీఐ వందేండ్ల ఉత్సవాల నేపథ్యంలో జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మీడియాతో శనివారం కూనంనేని చిట్‌చాట్ చేశారు.
ఖమ్మంలోని ఎస్‌ఆర్బీజీఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు ఏపీ, కేరళ, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలిరానున్నారని తెలిపారు. సభకు ముందు పది వేల మందితో ‘జనసేవాదళ్ కవాతు’ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఏడాది పొడవునా ఉత్సవాలు: పల్లా వెంకట రెడ్డి
సీపీఐ వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారాన్ని కోరుకున్నప్పుడే ప్రజలు కమ్యూనిస్టులను గుర్తు చేసుకుంటున్నారని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు ఏం సాధించారని కొందరు హేళన చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశ సమైక్యతకు విఘాతం కలగకుండా చూశామన్నారు.
