సాలెగూడలో బోరుబావిని మూసివేసిన ఫారెస్ట్​ ఆఫీసర్లు

సాలెగూడలో బోరుబావిని మూసివేసిన ఫారెస్ట్​ ఆఫీసర్లు
  • నిలదీసిన ఆదివాసీలు, తుడుందెబ్బ నేతలు
  • నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌‌ రూరల్‌‌ మండలంలోని సాలెగూడ గ్రామంలో ఆదివాసీలు వేసుకున్న బోరు బావిని ఫారెస్ట్‌‌ అధికారులు మూసివేయడం వివాదానికి దారి తీసింది. ఆదివాసీలు ఇటీవల తమ గ్రామ శివారులో బోరు బావి వేయించుకున్నారు. అయితే అది ఫారెస్ట్‌‌ ఏరియాలోని వస్తుందంటూ ఆదివారం అధికారులు వెళ్లి బావిని మూసివేశారు. దీనిపై గ్రామస్తులు, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ గొడం గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు, తుడుందెబ్బ నేతలతో కలిసి మూసివేసి బోరుబావిని పరిశీలించారు.

ఈ సందర్భంగా గణేశ్ ​మాట్లాడుతూ.. సాలెగూడ గ్రామ ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఒక బోరుబావిని మంజూరు చేసి వేసిందని, దాన్ని కూడా ఫారెస్ట్​ అధికారులు మూసివేస్తే ప్రజల నీటి కష్టాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. గత 15 రోజులుగా ఆదివాసీలు పెర్సపేన్‌‌ పూజల్లో బిజీగా ఉండగా.. వారు లేని సమయంలో ఫారెస్ట్‌‌ అధికారులు వచ్చి బోరుబావిని ధ్వంసం చేసి మూసి వేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఆదివాసీలపై ఇప్పటికైనా ఫారెస్ట్‌‌ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడడం ఆపాలన్నారు. సాలెగూడ ప్రజలకు మరోచోట బోరు బావి  వేసి వారి నీటి కష్టాలు తీర్చాలని కోరారు.