ఉక్రెయిన్‌‌ నుంచి వచ్చిన స్టూడెంట్ల లోన్లు మాఫీ చేయండి

ఉక్రెయిన్‌‌ నుంచి వచ్చిన స్టూడెంట్ల లోన్లు మాఫీ చేయండి
  • ​​​​​ఇందుకోసం పాలసీ తీసుకురండి
  • పార్లమెంటులో ప్రభుత్వానికి 
  • విజ్ఞప్తి చేసిన ఎంపీలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి మన దేశానికి వెనక్కి వచ్చిన మెడికల్ స్టూడెంట్లు.. ఇక్కడి వర్సిటీల్లో వైద్య విద్య పూర్తిచేసేందుకు అవకాశం కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఆయా విద్యార్థులు తీసుకున్న ఎడ్యుకేషన్‌‌ లోన్‌‌ను మాఫీ చేయాలని కోరా రు. సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ విషయాన్ని సభ్యులు చర్చించారు. లోక్‌‌సభ జీరో అవర్‌‌‌‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు రాజ్‌‌మోహన్ ఉన్నిథన్ లేవనెత్తారు. ఇంకా వేలాది మంది కేరళ స్టూడెంట్లు సుమీ నగరంలో చిక్కుకుపోయారని, వారిని భద్రంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను తరలించేందుకు కేంద్రం ముందుగా ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని, యుద్ధం మొదలయ్యే దాకా ఎదురుచూడాల్సింది కాదని కాంగ్రెస్ సభ్యుడు అబ్దుల్ ఖాలీఖ్ అన్నారు. ‘‘ఇండియన్ స్టూడెంట్లు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు సొంతంగానే వెళ్తున్నారు. వాస్తవంగా చూస్తే.. దీన్ని తరలింపు అనరు” అని విమర్శించారు. స్టూడెంట్లు తమ చదువులను పూర్తి చేసేందుకు దేశంలో రీలొకేట్ చేయాలని వైఎస్సార్‌‌‌‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌‌రెడ్డి, ఎం.శ్రీనివాసులురెడ్డి కోరారు. స్టూడెంట్లు మన దేశంలోనే చదువులు పూర్తి చేసేందుకు మరిన్ని మెడికల్ కాలేజీలను నిర్మించాలన్నారు. విద్యార్థులు అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, ‘యాక్ట్‌‌ ఆఫ్‌‌ వార్’ రూల్‌‌ను అమలు చేసి స్టూడెంట్లు తీసుకున్న విద్యా రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్‌‌ సురేశ్‌‌ సూచించారు.

రాజ్యసభలోనూ..
ఉక్రెయిన్‌‌ నుంచి తరలించిన స్టూడెంట్ల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు కోరారు. వారి చదువులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బడ్జెట్‌‌ సెషన్‌‌ రెండో విడుత తొలిరోజు సందర్భంగా చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఇంకా భారీ సంఖ్యలో స్టూడెంట్లను ఉక్రెయిన్ నుంచి తరలించాల్సి ఉందని చెప్పారు.