మూసీ రివర్ ఫ్రంట్పై కమిటీల ఏర్పాటు

మూసీ రివర్ ఫ్రంట్పై కమిటీల ఏర్పాటు
  • ఉత్తర్వులు ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించిన సీఎస్
  • టైమ్​లైన్ ​పెట్టుకుని పనులు పూర్తి చేయాలని సూచన 

హైదరాబాద్, వెలుగు: మూసీ రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌పై నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ఇవ్వాలని ఆఫీసర్లను సీఎస్​ శాంతికుమారి ఆదేశించారు. మూసీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాజెక్టును టైమ్​లైన్​పెట్టుకుని పూర్తి చేయాలని సూచించారు. సోమవారం సీఎస్​శాంతికుమారి అధ్యక్షతన సెక్రటేరియెట్ లో  మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..మూసీ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. పబ్లిక్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ భాగస్వామ్యంతో మూసీని డెవలప్ చేస్తామని వెల్లడించారు. రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌  ప్రాజెక్ట్‌‌‌‌పై పెట్టుబడిదారులు, వాటాదారుల్లో  విశ్వాసాన్ని పెంచేందుకు మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను కోరారు. మూసీ రివర్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(ఎంఆర్‌‌‌‌డీసీఎల్‌‌‌‌) ఎండీ  ఆమ్రపాలి మాట్లాడుతూ..ప్రాజెక్ట్ అంశాలను సమావేశంలో పాల్గొన్న అధికారులకు వివరించారు.  

ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలు, గుర్తించబడిన పనుల డీపీఆర్​లు, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ మొదలైన విభాగాలకు  టైమ్‌‌‌‌లైన్‌‌‌‌లు నిర్ణయించారు. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ ముసాయిదా సిద్ధమవుతుందని చెప్పారు. అనేక ప్రైవేట్‌‌‌‌ సంస్థలు ప్రాజెక్ట్‌‌‌‌పై ఆసక్తిని కనబరుస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ  దానకిశోర్ తెలిపారు.

మూసీ రివర్‌‌‌‌ఫ్రంట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ఉస్మాన్‌‌‌‌ సాగర్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ డౌన్‌‌‌‌స్ట్రీమ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు వరకు, హిమాయత్‌‌‌‌సాగర్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ డౌన్‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ నుంచి బాపూఘాట్‌‌‌‌లో సంగమం పాయింట్‌‌‌‌ వరకు 55 కిలోమీటర్ల మేర నది విస్తరణ ప్రతిపాదనపై బోర్డు చర్చించింది.

నగరంలోని మూసీ నది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించింది. మీటింగులో హెచ్‌‌‌‌ఎండబ్ల్యూఎస్‌‌‌‌బీ ఎండీ  సుదర్శన్‌‌‌‌రెడ్డి, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.