Vishnu Murthy: 'రీల్స్ కట్ చేస్తాం బిడ్డా' అన్న విష్ణుమూర్తి ఇక లేరు: 'పుష్ప 2' వివాదంలో ఆయన పాత్ర ఇదే!

Vishnu Murthy: 'రీల్స్ కట్ చేస్తాం బిడ్డా' అన్న విష్ణుమూర్తి ఇక లేరు: 'పుష్ప 2' వివాదంలో ఆయన పాత్ర ఇదే!

గతేడాది డిసెంబర్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలైంది. ఆ సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లారు. తమ హీరోను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా భారీగా పోటెత్తారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అక్కడ 35 ఏళ్ల రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ విషాద ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన భద్రతా సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

గుండెపోటుతో విష్ణుమూర్తి మృతి.. 

ఈ తొక్కిసలాట తర్వాత పోలీసుల పనితీరు విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ వ్యవహారంపై అక్టోబర్ 2024లో అవినీతి ఆరోపణల కారణంగా సస్పెన్షన్‌కు గురైన (నిజామాబాద్‌లో డీఎస్పీగా ఉన్నప్పుడు) ఏసీపీ విష్ణుమూర్తి రంగంలోకి దిగారు. ఆయన ప్రెస్ క్లబ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి, అల్లు అర్జున్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ALSO READ : OTTలోకి'మిరాయ్'.. థియేటర్లలో కనిపించని సీన్స్ కలిపి రిలీజ్..

అయితే ఈ తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్‌కు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసి వార్తల్లో నిలిచిన మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) విష్ణుమూర్తి ఇక లేరు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పోలీస్ శాఖలో సూటిగా మాట్లాడే వైఖరితో గుర్తింపు తెచ్చుకున్న విష్ణుమూర్తి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. 

తొక్కిసలాటపై కామెంట్స్..

అప్పట్లో విష్టుమూర్తి కామెంట్స్ పరిశీలిస్తే.. "డబ్బు మదంతో బడాబాబులు మాట్లాడుతున్నారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తి (అల్లు అర్జున్) ప్రెస్ మీట్ పెట్టి పోలీసులపై ఆరోపణలు చేయడం, పోలీసుల ప్రతిష్టను దిగజార్చడం సరికాదు. చట్టం ముందు అందరూ సమానమే. హీరోలకి ప్రత్యేక చట్టాలేమీ ఉండవు. ప్రైవేట్ సైన్యాన్ని చూసుకుని ఓవరాక్షన్ చేస్తే అందరినీ లోపలేస్తాం. 'రీల్స్ కట్ చేస్తాం బిడ్డా'" అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిబంధనల ఉల్లంఘన..

అయితే, సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించినందుకు గానూ విష్ణుమూర్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అక్షాంశ్‌ యాదవ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ..  అనుమతి లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. ఈ చర్యపై డీజీపీకి నివేదికను పంపి, తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.

ఒకవైపు ప్రజల పక్షాన గళమెత్తి హీరోను హెచ్చరించిన ధైర్యవంతుడిగా, మరొకవైపు శాఖాపరమైన నిబంధనలను ఉల్లంఘించిన అధికారిగా విష్ణుమూర్తి వార్తల్లో నిలిచారు. ఈ వివాదాస్పద ఎపిసోడ్ ముగిసిన కొద్ది కాలానికే గుండెపోటుతో ఆయన మరణించడం విషాదకరం. ఆయన మృతి పట్ల పలువురు దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.