
- 2011లో వరంగల్‌లో ఇరిగేషన్ ఏఈగా చేరిక
- 2015లో ప్రియురాలిని హత్య చేసి జైలుకు
- రిలీజ్ అయ్యాక సొంతూరిలో వ్యవసాయం
- 2018లో ఉద్యోగం మానేసి మాల్ ప్రాక్టీస్ దందా షురూ
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్‌సీ పేపర్ల లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు, మాజీ ఏఈ రమేశ్ నెట్‌వర్క్‌లో క్రిమినల్ హిస్టరీని సిట్ బయటకు తీస్తున్నది. మంగళవారం నిర్వహించిన కస్టడీ విచారణలో కీలక వివరాలు రాబట్టింది. రమేశ్ నెట్‌వర్క్‌లో సుమారు 80 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. మాస్ కాపీయింగ్, ఏఈ పేపర్ లీక్ చేసి పరీక్ష రాసిన అభ్యర్థుల ఇండ్లలో మంగళవారం కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షల్లో రమేశ్ హైటెక్ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విషయం తెలిసిందే. డిజిటల్ డివైజెస్‌తో ఏడుగురు అభ్యర్థులను ఏఈఈ, డీఏవో పరీక్షలు రాయించాడు. రమేశ్ ను గత వారం సిట్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. కోర్టు అనుమతితో ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నది. మూడో రోజు మంగళవారం విచారణలో భాగంగా కీలక వివరాలు రాబట్టింది. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం బీరంగికి గ్రామానికి చెందిన రమేశ్.. 2011లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరాడు. కొంతకాలం వరంగల్‌లో ఏఈగా విధులు నిర్వహించాడు. అదే సమయంలో స్థానిక యువతిని పెండ్లి చేసుకున్నాడు. భార్య కూడా వరంగల్ వాటర్ వర్క్స్‌లో పనిచేసేది. ఐతే పెండ్లికి ముందే బి కొత్తపేటకు చెందిన ఓ యువతితో రమేశ్ కు ప్రేమ వ్యవహారం ఉండేది. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో 2015లో ఆమెపై రమేశ్ తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో బి కొత్తకోట పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 45 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. 2016 జనవరిలో జైలు నుంచి రిలీజ్ అయ్యాక సొంతూరిలోనే వ్యవసాయం చేసుకున్నాడు.
పోటీ పరీక్షలు రాసే యువతపై కన్ను
రమేశ్ 2017లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. 8 నెలలు మాత్రమే విధులు నిర్వహించాడు. చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేశాడు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో పనిచేస్తూనే 2018లో ఉద్యోగం మానేశాడు. పోటీ పరీక్షలు రాసే యువతను టార్గెట్ చేసుకున్నాడు. మాల్ ప్రాక్టీస్‌లో పాస్ చేయిస్తానని అభ్యర్థులతో కాంటాక్టులు పెంచుకున్నాడు. ఇలా ఈ ఏడాది జనవరిలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పరీక్షను మాస్ కాపీయింగ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇద్దరు అభ్యర్థులతో ఎక్విప్‌మెంట్ పరిశీలించాడు. అది సక్సెస్ కాకపోవడంతో మాల్ ప్రాక్టీస్ ప్లాన్ ఫెయిలైంది. ఈ క్రమంలోనే ఏఈఈ, డీఏవో పరీక్షలను మాస్ కాపీయింగ్ చేసేందుకు స్కెచ్ వేశాడు. టోలిచౌకిలోని అలీ అనే కాలేజీ ప్రిన్సిపల్‌తో ప్రశ్నపత్రం బయటకు పంపించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అలీ సహకారంతో ఏడుగురు అభ్యర్థులను ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేశాడు. అలీతో పాటు అభ్యర్థుల కోసం సిట్ అధికారులు వెతుకుతున్నారు.
రమేశ్ నెట్ వర్క్‌లో 80 మంది!
ఏఈఈ, డీఏవో మాస్ కాపీయింగ్, ఏఈ పేపర్ లీకేజీలతో ఎంత మంది పరీక్షలు రాశారనే వివరాలు సేకరిస్తున్నారు. రమేశ్ కాంటాక్టులు, బ్యాంక్ అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ కూతురుకు ఉద్యోగం కోసం రూ.75 లక్షలతో ఒప్పందం చేసుకున్నట్లు గుర్తించారు. రమేశ్ నెట్‌వర్క్‌లో సుమారు 80 మంది అభ్యర్థులు ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలు రాసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి వివరాలు సేకరిస్తున్నారు