Jhunjhunwala: మార్కెట్ల పతనంలోనూ జున్‌జున్‌వాలాకి లాభాలు.. ఏకంగా రూ.890 కోట్లు గెయిన్

Jhunjhunwala: మార్కెట్ల పతనంలోనూ జున్‌జున్‌వాలాకి లాభాలు.. ఏకంగా రూ.890 కోట్లు గెయిన్

Rekha Jhunjhunwala: దివంగత స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా కీర్తిని ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అందుకే దేశీయ స్టాక్ మార్కెట్లలోని చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆమె పోర్ట్ ఫోలియోను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా లేక నష్టాల్లో ఉన్నా రేఖా మాత్రం భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను భారత్ పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్మేసి పతనమైనప్పటికీ రేఖా మాత్రం దూసుకుపోతున్నారు. 

యుద్ధ వాతావరణం మధ్య దలాల్ స్ట్రీట్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే రేఖా  జున్‌జున్‌వాలాకి డబ్బుల వర్షం కురుస్తోంది. ఆమెకు టాటా గ్రూప్ కంపెనీల్లో ఉన్న పెట్టుబడుల విలువ నేడు ఏకంగా రూ.892 కోట్ల మేర పెరుగుదలను చూసింది. కార్గిల్ యుద్ధం సమయంలో కూడా టాటా మోటార్స్ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. అప్పట్లో స్టాక్ ఏకంగా 92 శాతం పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో టాటాలకు చెందిన మరో కంపెనీ టైటాన్ కంపెనీ షేర్లు సైతం నేడు పతనాల మార్కెట్లో కూడా లాభాలను రుచిచూసింది. దీంతో స్టాక్ దాదాపు 5 శాతం పెరుగుదలను చూసింది. 

ALSO READ | డిఫెన్స్ కంపెనీలకు దిల్లీ పెద్దల నుంచి కాల్స్.. దూసుకుపోతున్న ఆ కంపెనీల స్టాక్స్..

శుక్రవారం ఒక్కరోజునే టైటాన్ కంపెనీలో జున్‌జున్‌వాలాలకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.15వేల 402 కోట్ల నుంచి రూ.16వేల 165 కోట్లకు పెరిగింది. అంటే కేవలం ఒక్కరోజులోనే రేఖా సంపదను టైటాన్ స్టాక్ రూ.762.69 కోట్ల మేర పెంచేసింది. ఇదే క్రమంలో టాటా మోటార్స్ కంపెనీ షేర్లు దాదాపు 4 శాతం పెరుగుదలను చూడటంతో ఆమె రూ.129.45 కోట్ల వరకు రాబడిని అందుకున్నారు. మెుత్తానికి ఈ రెండు కంపెనీల నుంచే జున్‌జున్‌వాలాలకు రూ.892 కోట్ల సంపద సృష్టి నేడు ఒక్కరోజే జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

దీనికి తోడు టాటా మోటార్స్ సంస్థ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో టాటా మోటార్స్ ఫైనాన్స్ సంస్థను కూడా మెర్జ్ చేయాలని చూస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది టాటా మోటార్స్ సంస్థకు పూర్తిగా అనుబంధ సంస్థగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.