
ఇండియా-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులలో క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తూ వస్తున్న ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ రద్దు అవుతందని, లేదా నిరవధిక వాయిదా ఉంటుందనే ఊహాగానాల నడుమ మ్యాచ్ ల నిర్వహణపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ ఐపీఎల్ సీజన్ కంటిన్యూ అవుతుందా లేక పూర్తిగా రద్దవుతుందా అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ.
నిరవధిక వాయిదా అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది BCCI. ఇప్పటికిప్పుడు ఒకే ఒక్క వారం రోజులు మాత్రం మ్యాచులు నిలిపివేస్తున్నామని.. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దేశం కంటే.. మన దేశ సైనికుల కంటే క్రికెట్ గొప్పది కాదంటూ కూడా స్పష్టం చేసింది బీసీసీఐ.
ALSO READ | IPL2025: ఆగిపోయిన ఐపీఎల్ హిస్టరీ ఇదే..
గురువారం (మే 8) అర్థంతరంగా ధర్మశాలలో పంజాబ్ - ఢిల్లీ మ్యాచ్ ను వాయిదా చేసిన బీసీసీఐ చర్చోపచర్చల తర్వాత ఐపీఎల్ పై శుక్రవారం (మే 9) క్లారిటీ ఇచ్చింది. IPL 2025 ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇవాళ (శుక్రవారం మే 9) జరగాల్సిన లక్నో - బెంగళూరు మ్యాచ్ వాయిదా పడింది. ‘‘టాటా ఐపీఎల్ 2025 షెడ్యూల్ ను వారం రోజుల పాటువాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది’’ అని సెక్రెటరీ దేవజిత్ సైకియా ప్రకటించారు.
తదుపరి షెడ్యూల్ ను ఇండియా-పాక్ మధ్య ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గటం లేదా దీనిపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ కంటే దేశమే ముఖ్యమని, ప్రభుత్వానికి, సైనికులకు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ లో ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికుల పక్షాన బీసీసీ నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. క్రికెట్ దేశ ప్రజల ప్యాషన్ అయినప్పటికీ.. దేశ భద్రత, ప్రయోజనాలతో పోల్చినప్పుడు దేశమే ముఖ్యమని పేర్కొన్నారు.
బీసీసీఐ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరిస్తున్న బ్రాడ్ కాస్టర్ జియో స్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా టైటిల్ స్పాన్సర్ టాటాతో పాటు అసోసియేట్ స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.