చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్‭తో మాజీ మంత్రి

చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్‭తో మాజీ మంత్రి

సాధారణంగా సెలబ్రిటీలు ఎగ్జామ్ హాల్లో కనిపించడం కామన్.. కాని ఓ రాజకీయ నాయకుడు ఎగ్జాయ్ రాయడం. అందులోనూ 51 ఏళ్ల వయసులో చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్‭తో కనిపించడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‭లోని బరెలీ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ మిశ్రా అలియాస్ పప్పు భర్తౌల్.. 2017 ఎన్నికల్లో బైథ్రి చైన్ పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఆ పార్టీ నిరాకరించింది. దీంతో ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే.. మరో పక్క చదువును కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 16 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో.. మాజీ ఎమ్మెల్యే తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి వచ్చారు. ఒక చేతిలో ఎగ్జామ్‌ ప్యాడ్‌, హాల్‌ టికెట్‌, మరో చేతిలో వాటర్‌ బాటిల్‌తో ఉన్న రాజేశ్ మిశ్రాను చూసిన విద్యార్థులు ఆశ్చర్యపోయారు. లా డిగ్రీ చేసి సామాన్యులకు సరైనా న్యాయం అందేలా చేయడమే తన సంకల్పమని.. అందుకే చదువుకుంటున్నానని విద్యార్థులకు తెలిపారు. 

తనకు సైన్సు అంటే ఎక్కువగా ఇష్టమని కాని.. లాయర్‌ కావాలనే ఉద్దేశంతో ఆర్ట్స్‌ను ఎంచుకున్నాను అని రాజేష్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. తనను చూసి ఆశ్చర్యానికి గురైన విద్యార్థులు.. కానీ, ఓ రాజకీయ నేత మాతో కలిసి పరీక్షలు రాస్తున్నారని సంతోషించారని ఆయన చెప్పారు. హిందీ, ఫైన్ ఆర్ట్స్, సోషల్ స్టడీస్, సివిక్స్, సోషియాలజీల సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నానని వివరించారు. రోజూ రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు చదువుతానని, ఈ విషయంలో తన కుటుంబసభ్యులు కూడా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడటానికి తన పిల్లలు కూడా టిప్స్ చెబుతున్నారని రాజేశ్ మిశ్రా వివరించారు.