- పంజాబ్ గ్యాంగ్‌తో బీఆర్ఎస్ నేత బెదిరింపులు
- గతంలో ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్.. అడుగు పెడితే చంపేస్తామంటున్నరు
- జీవన్‌రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది
- చేవెళ్ల పోలీస్ స్టేషన్లో బాధితుడు సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు
- ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు భూకబ్జా కేసు
చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేసి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా పెట్టాడని, అక్కడికెళ్లిన తనపై దాడి చేశారని.. అడుగుపెడితే చంపేస్తామని మారణాయుధాలు చూపి బెదిరిస్తున్నారంటూ బాధితుడు సామ దామోదర్‌రెడ్డి ఈ నెల 22న చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి ఆరు సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదు చేశారు. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామంలోని 35, 36 సర్వే నెంబర్లలో ఉన్న గుడి, ఫంక్షన్ హాల్ సహా సుమారు 65 ఎకరాలను జీవన్ రెడ్డి కబ్జా చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశారు. అక్కడ వెంకటేశ్వరస్వామి, సాయిబాబా గుడికి, ఫంక్షన్ హాల్ కు తాళం వేసి ప్రైవేట్ వ్యక్తులను కాపలా పెట్టిన్నట్లు పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే తప్పుడు డాక్యుమెంట్లతో113 ఎకరాలు స్వాహా చేశాడని ఆరోపించారు. దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు.. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా ఆశన్నగారి జీవన్ రెడ్డి, అతని భార్య ఆశన్నగారి రజితను ఏ2గా, అతని తల్లి ఆశన్నగారి రాజుబాయిని ఏ3గా, డి. సురేశ్ ను ఏ4గా, మరికొందరిని ఇతర నిందితులుగా చేర్చారు. ఈర్లపల్లి గ్రామ శివారులో తాను 20 ఎకరాల 20 గుంటల భూమిని గతంలో కొనుగోలు చేశానని, అందులో తన తండ్రి పరమా రెడ్డి పేరు మీద ఫంక్షన్ హాల్ ను కట్టానని బాధితుడు ఫిర్యాదులో తెలిపారు. తన భూమికి పక్కనే ఉన్న భూమికి ఓనర్లు అయిన జీవన్ రెడ్డి, రజిత, రాజుబాయి.. 2023లో తన భూమిలో సగం ఆక్రమించుకుని ఫంక్షన్ హాల్ ను కూల్చి కొత్త బిల్డింగ్ కట్టించాడని ఆరోపించారు. తన భూమి వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. అక్కడ కాపలా ఉన్న సురేశ్ బెహర్ తో పాటు పంజాబీ గ్యాంగ్, ఇతరులు తమను అడ్డుకుని మారణాయుధాలతో బెదిరించారని వివరించారు.
అగ్రిమెంట్ కుదుర్చుకుని మోసం?
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ పెద్దలకు, పోలీసు అధికారుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని అత్తాపూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, పొలిటికల్ లీడర్ సామ దామోదర్ రెడ్డి తెలిపారు. గతంలో తనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ను సైతం రంగంలోకి దించారని, వారిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. తనకు ఈర్లపల్లితోపాటు శంకర్ పల్లి మండలం టంగటూర్ గ్రామంలో 330 ఎకరాల భూమి ఉందని, ఇందులో 172 ఎకరాలను లేఅవుట్ చేశామని వెల్లడించారు. తర్వాత113 ఎకరాలకు సంబంధించి జీవన్ రెడ్డితో ఎంఓయూ కుదుర్చుకున్నానని, ఇద్దరి మధ్య ప్రాపర్టీస్ బదలాయింపు కోసం అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. తన ఆస్తులను బదలాయించిన తర్వాత జీవన్ రెడ్డి ఆస్తులను తనకు బదలాయింపు చేయకపోవడంతో వివాదం మొదలైందన్నారు. ఎంఓయూ ప్రకారం రూ. కోటికి 4 ఎకరాల చొప్పున 64 ఎకరాలు తనకు రావాల్సి ఉందన్నారు.
