
- ఇప్పటికే బీఎల్ సంతోష్ను కలిసిన పలువురు లీడర్లు
- తాజాగా బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా
- 10 నుంచి 12 మంది ఒకేసారి చేరుతారనే ప్రచారం
- చేరికలపై కమలం రాష్ట్ర నేతల వ్యతిరేకత
హైదరాబాద్/నాగర్ కర్నూల్, వెలుగు: బీఆర్ఎస్లో మళ్లీ రాజీనామాల పర్వం మొదలైంది. గత అసెంబ్లీ, లోక్ సభఎన్నికల్లో పార్టీ ఓటమిపాలయ్యాక పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా కాళేశ్వరం కమిషన్రిపోర్ట్.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టిన తరుణంలో బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. బాలరాజు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ పంపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా గువ్వల బాటలోనే రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలువురు నేతలు.. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను కలిసినట్టు తెలిసింది. అయితే, ఇది ఒక్క గువ్వలతోనే ఆగిపోదని ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 10 నుంచి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, వీరి చేరికలను బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి వస్తున్న వారిలో చాలామందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల్లో ఇరుక్కున్నారని, అలాంటి నేతలను పార్టీలోకి ఎలా రానిస్తారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితులే కారణమా?
అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. దీంతో సుమారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి.. కాంగ్రెస్‌లోకి వచ్చారు. మరో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వస్తారని ప్రచారం జరిగినా పలు కారణాల వల్ల ఆగిపోయారు. గత సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలతో పాటు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కీమ్, ఫార్ములాఈ రేసింగ్ తదితర స్కాములు, అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు ఎంక్వైరీ చేసింది. కాగా, ఆయా కేసుల్లో బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా అడ్డంగా ఇరుక్కున్నారు. ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరం ఫెయిల్యూర్, అక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్‌నే బాధ్యుడిగా చేసింది. దీనికి తోడు కేసీఆర్ కుటుంబంలో గొడవలు, కేటీఆర్ ఒంటెత్తుపోకడలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీటిని చక్కదిద్ది, ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. పార్టీలోని ఈ పరిస్థితులు నేతలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి పిలుపు వస్తుండటంతో చాలామంది బీఆర్ఎస్ నేతలు కమలం వైపు చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నెల 2వ తేదీనే కేసీఆర్‌కు గువ్వల లేఖ
గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఈ నెల 2వ తేదీనే కేసీఆర్‌కు లేఖను పంపించారు. తాజాగా అది బయటకు వచ్చింది. రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్లో ఉన్న తాను, ఎంతో నేర్చుకొని రాజకీయంగా ఎదగడంతో పాటు ప్రజలకు చేతనైన సేవ చేశానని లేఖలో పేర్కొన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన తనపై ఎంతో నమ్మకం ఉంచి, కీలకమైన బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ను వీడడం బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కాగా, అచ్చంపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.