హైదరాబాద్, వెలుగు: ఇండియా ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్, దేశంలో తొలి ప్రొఫెషనల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన హైదరాబాదీ మొహమ్మద్ హబీబ్ ఇకలేడు. రెండేళ్లుగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 74 ఏండ్ల హబీబ్ మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశాడు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 1949లో హైదరాబాద్‌లో పుట్టిన హబీబ్ 1965-–75 మధ్య పలు ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
1970లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన టీమ్‌లో మెంబర్‌గా ఉన్నాడు. 1960, 70ల్లో ఇండియా ఫుట్‌బాల్‌లో ఓ వెలుగు వెలిగాడు. 1977లో బ్రెజిల్ లెజెండ్ పీలే నేతృత్వంలోని న్యూయార్క్ కాస్మోస్ క్లబ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేయడం హబీబ్ కెరీర్లో గుర్తుండిపోయే సందర్భం. హబీబ్ మృతి పట్ల ఇండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ అమల్ రాజ్, తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సంతాపం వ్యక్తం చేసింది.