చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే,  కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. సోమవారం (అక్టోబర్ 13) తెల్లవారుజామున హైదర్ గూడా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసిన ఆయన మరణవార్త ఇటు పార్టీ శ్రేణులలోనూ, అటు రంగారెడ్డి జిల్లాలోనూ విషాదం మిగిల్చింది.

ఎన్ఎస్ఎస్ (NSS) వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా, ప్రజాప్రతినిధిగా విశిష్ట సేవలు అందించిన ఆయన 84 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆయన మృతి తీరని లోటు అని పార్టీ నేతలు, చేవెళ్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

 లక్ష్మారెడ్డి రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడు లక్ష్మారెడ్డి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా,  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా పలు హోదాల్లో పని చేశారు.

1999,  2014 లో రెండు పర్యాయాలు లక్ష్మారెడ్డి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.  జర్నలిజం పట్ల గల ఆసక్తి,  నిబద్ధత కారణంగా 1980లో ఆయన న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్(ఎన్ ఎస్ ఎస్ ) అనే ఒక వార్తా సంస్థ ప్రారంభించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా,  జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షులుగా,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా లక్ష్మారెడ్డి సేవలందించారు. మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐ జె యు) సంతాపం ప్రకటించింది.