కేసీఆర్ వస్తారా.?..కాళేశ్వరంపై జవాబిస్తారా?..హాట్ టాపిక్ గా అసెంబ్లీ సెషన్

కేసీఆర్ వస్తారా.?..కాళేశ్వరంపై జవాబిస్తారా?..హాట్ టాపిక్ గా అసెంబ్లీ సెషన్

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్  అసెంబ్లీకి వస్తారా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 30  నుంచి ఐదు రోజుల పాటు సెషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ రాక మరో మారు చర్చకు దారి తీసింది. డిసెంబర్ 7, 2023న కాంగ్రెస్  ప్రభుత్వం కొలువు దీరింది. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ బాత్ రూంలో జారి పడటంతో తుండి ఎముక ప్రాక్చర్ అయ్యింది. దీంతో ఆయనకు సర్జరీ చేశారు. తర్వాత బెడ్ రెస్టులో ఉన్నారు. 

తర్వాత స్పీకర్ చాంబర్ లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. 2024లో  నిర్వహించిన బడ్జెట్ సెషన్ కు హాజరై కొద్ది సేపు ఉండి వెళ్లిపోయారు. తర్వాత ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు హాజరయ్యారు. టెక్నికల్ గా డిస్ క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ సారైనా అసెంబ్లీకి వస్తారా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును తానే నిర్మించినట్టు, డిజైనింగ్, ఇంజినీరింగ్ తానే చేసినట్టు చెప్పుకొన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఏం సమాధానం చెప్పబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ వేదికగా తన గొంతుక వినిపిస్తారా..? లేదా..? లేదా ఎప్పటి మాదిరిగానే హరీశ్ రావు ఈ అంశంపై మాట్లాడుతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఈ సారి బీఏసీ మీటింగ్ కు కేసీఆర్ వస్తారా..? లేదా ఎప్పటిలాగే హరీశ్ రావు హాజరవుతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.