దళితబంధుపై కేసీఆర్ కామెంట్స్​​ బూమరాంగ్​!

దళితబంధుపై కేసీఆర్ కామెంట్స్​​ బూమరాంగ్​!
  •     మూడేండ్లలో 37 వేల మందికే అందిన స్కీమ్
  •     లక్షా 30 వేల మందికి ప్రొసీడింగ్స్​ ఇచ్చామన్న మాజీ సీఎం​
  •     లబ్ధిదారులతో ధర్నా చేస్తామని ప్రభుత్వానికి కేసీఆర్​ హెచ్చరిక
  •     పేర్లు తప్ప ప్రొసీడింగ్స్​ ఇయ్యలేదని తెలియడంతో నాలుక కరుచుకుంటున్న బీఆర్ఎస్​ అధినేత

హైదరాబాద్​, వెలుగు : దళితబంధుపై మాజీ సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్స్​ బూమరాంగ్​ అవుతున్నాయి. దళితబంధు స్కీం రెండేండ్లు అసలు అమలు కాలేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చెప్పడంతో గులాబీ బాస్​ గందరగోళంలో పడినట్టు తెలిసింది.​ దళితబంధు  కోసం మనం ఒక్క రూపాయి కూడా రిలీజ్​ చేయలేదని.. ఇంకా కలెక్టర్ల అకౌంట్లలోకి ఎలా జమ అవుతాయని వారు చెప్పగానే.. ఈ స్కీంపై కేసీఆర్​ యూ టర్న్ తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.  

పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయినింగ్​లో భాగంగా ఇటీవల కేసీఆర్​ దళితబంధుపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్​ ప్రభుత్వం దళితబంధు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి.  మేం ప్రొసీడింగ్స్​ ఇచ్చిన 1.30 లక్షల మంది దళితులను తీసుకొచ్చి స్వయంగా సెక్రటేరియట్‌‌‌‌వద్ద ఉన్న అంబేద్కర్‌‌విగ్రహం దగ్గర దీక్షపట్టి,  ప్రభుత్వం మెడలు వంచి అవన్నీ వారికి ఇప్పిస్తాం” అని గతవారం చేవేళ్ల మీటింగ్​లో  కేసీఆర్​మాట్లాడారు.

ఆ మీటింగ్ అనంతరం ప్రస్తుత బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పిలిచి దళితబంధు ప్రొసీడింగ్స్​ కాపీలు అందిన వారి లిస్ట్​ తీసుకుని.. వాళ్లను అంబేద్కర్​ విగ్రహం దగ్గర దీక్షకు తీసుకువచ్చేందుకు ప్లాన్​ చేయాలని సూచించారు. ముందు  గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి దళితబంధు ప్రొసీడింగ్స్​ ఎవరికి అందాయా? అని  వివరాలు సేకరించే  పనిలో పడిన బీఆర్ఎస్​ కు ఆ పార్టీ  శ్రేణుల నుంచే ఆదిలోనే షాక్​ తగిలింది. దళితబంధు ఇస్తామని పేర్లు రాసుకున్నారే తప్ప.. ఎక్కడా ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని ఎమ్మెల్యేలు కేటీఆర్​, హరీశ్​రావుతోనే పార్టీ కార్యకర్తలు చెప్పడంతో ''కరెక్టే   మనం ఇవ్వలే కదా’’  అని కంగుతిన్నట్టు తెలిసింది.  

2021తోనే దళితబంధు క్లోజ్​

హుజూరాబాద్​ బై ఎలక్షన్​ టైంలో (2021లో) ఆ నియోజకవర్గం మొత్తానికి పైలెట్​ ప్రాజెక్ట్​గా దళిత బంధు స్కీమ్​ను అమలు చేశారు. అనంతరం పైలెట్​ ప్రాజెక్టు కిందనే మిగతా సెగ్మెంట్లలో ఒక్కో చోట వంద మందికి, మరో నాలుగు మండలాల్లో  పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఆ తర్వాత 2023లో దాదాపు 460 మందికి దళితబంధు ఇచ్చి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది.

ఇలా మొత్తంగా చూసినా దళితబంధు లబ్ధిదారుల సంఖ్య మూడేండ్లలో 37 వేలు దాటలేదు. వాస్తవానికి మూడేండ్లలో ఈ స్కీం మూడున్నర లక్షల మందికి పైగా అందాల్సి ఉన్నది. 2022-23, 2023-24 రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.17,700 కోట్ల చొప్పున బడ్జెట్​లో నిధులు కేటాయించినప్పటికీ..   ఒక్కరికి కూడా దళితబంధు అమలు చేయలేదు. నిరుడు ఎన్నికల సంవత్సరం కావడంతో దళితబంధు స్కీంను హడావుడిగా మళ్లీ మొదలుపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. అదీ సాధ్యపడలేదు. పైగా గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు ఇప్పిస్తామని చెప్పి ముందే కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా తీసుకున్నారు. ఈ విషయాన్ని అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్​కూడా ప్రస్తావించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత.. ఇప్పుడు మళ్లీ అదే టాపిక్​

దళితబంధు స్కీంను గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఎమ్మెల్యేలకు లింక్ చేసింది. ఎమ్మెల్యేలు ఎవరి పేరు రాసి ఇస్తే వారికే ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ స్కీం కోసం రెండుసార్లు ఎమ్మెల్యేలు పేర్లు రాసుకున్నారు కానీ.. ఒక్కరికీ పథకం వర్తింపజేయలేదు. ఎమ్మెల్యే తమ పేరు రాసుకోలేదని.. పేరు రాసుకున్నా స్కీమ్​ ఇవ్వలేదని మరికొందరు దళితులు బీఆర్ఎస్​కు వ్యతిరే కంగా ఓటు వేశారని ఆ పార్టీ అంతర్గత విశ్లేష ణల్లోనే వెల్లడైంది.

ఇప్పుడు అదే స్కీమ్​పై కేసీఆర్​ కామెంట్స్​ చేస్తుండటంతో మళ్లీ  మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని పార్టీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్​ దళితబంధు స్కీమ్​పై కామెంట్లు మానుకుంటే మంచిదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.