ప్రజల సంపద పంచుతామని నేను అనలే : రాహుల్ గాంధీ

ప్రజల సంపద పంచుతామని నేను అనలే : రాహుల్ గాంధీ
  • నా కామెంట్లను మోదీ వక్రీకరించి చెప్పారు
  • అన్యాయానికి గురైన వాళ్లను గుర్తించేందుకే ఈ సర్వే
  • కుల గణన అంటే ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా
  • సామాజిక్ న్యాయ్ సమ్మేళన్‌’లో రాహుల్ కామెంట్ 

న్యూఢిల్లీ :  ప్రజల సంపదను అందరికీ సమానంగా పంచుతామని తాను అనలేదని కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ తన కామెంట్లను వక్రీకరించి.. కాంగ్రెస్​ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ‘సామాజిక, ఆర్థిక సర్వే’ చేస్తామని మాత్రమే మేనిఫెస్టోలో చెప్పామన్నారు. అంతేగానీ.. సర్వే డేటా ఆధారంగా సంపద  పంచుతామని అనలేదన్నారు. 

మోదీ పాలనలో ఎంత మంది ప్రజలకు అన్యాయం జరిగిందో తెలుసుకునేందుకే  సర్వే చేపడ్తామని తెలిపారు. ఢిల్లీలో బుధవారం కాంగ్రెస్ నిర్వహించిన ‘సామాజిక్​ న్యాయ్ సమ్మేళన్‌‌’లో రాహుల్‌‌ మాట్లాడారు. ‘‘ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తది. ఆ వెంటనే జాతీయ కుల గణన చేపడ్తాం. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుం’’అని తెలిపారు. 

దేశ భక్తులు ఎందుకు భయపడ్తున్నరు?

కుల గణన అంటే.. కులాలను మాత్రమే లెక్కించడం కాదని.. ఇందులో ఎకనామిక్, ఇన్​స్టిట్యూషనల్ సర్వే కూడా ఉంటుందని రాహుల్ చెప్పారు. 70 ఏండ్ల తర్వాత చేపట్టే కీలకమైన సర్వే ఇది అని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి మోదీ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో అన్యాయానికి గురైన 90 శాతం మందికి న్యాయం కల్పించడమే తమ జీవిత ధ్యేయమని, కులగణను ఏ శక్తీ ఆపలేదన్నారు. 

మీడియాకు ఏది సీరియస్సో తెలియట్లేదు

మీడియా కూడా మోదీ విమర్శలను పదే పదే టెలికాస్ట్ చేస్తూ సమస్యను కాంప్లికేట్ చేస్తున్నదని రాహుల్ మండిపడ్డారు. ‘‘నన్ను కొన్ని మీడియా సంస్థలు ‘నాన్ సీరియస్ పొలిటీషియన్’ అని అంటున్నాయి. ఉపాధిహామీ పథకం, భూసేకరణ బిల్లు, భట్టా పర్సౌల్ ఉద్యమం, నియమగిరి హిల్స్ లో నా పాత్ర ఉంది. ఇవేమీ మీడియాకు కనిపించవు. అదే.. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే మాత్రం సీరియస్​గా తీస్కుంటరు. మీడియాతోపాటు న్యాయవ్యవస్థ, టాప్ 200 కంపెనీల్లోనూ ఓబీసీ, దళిత, గిరిజనులపై వివక్ష ఉందన్నారు. 

ప్రధాని తన బిలియనీర్‌‌ ఫ్రెండ్స్ తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు.  ‘‘రూ.16 లక్షల కోట్లతో ఎన్నో సమస్యలు పరిష్కరించొచ్చు. 16 కోట్ల మందికి ఏడాదికి రూ.లక్ష జీతంతో జాబ్ ఇవ్వొచ్చు. 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి రూ.లక్ష చొప్పున ఇస్తే వారి సమస్యలన్నీ పోతాయి. రుణమాఫీ చేస్తే రైతు ఆత్మహత్యలను అరికట్టేవాళ్లం” అని రాహుల్ చెప్పారు.  తాము అధికారంలోకి వస్తే.. దేశంలో కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తామన్నారు.