ఎన్నికల లబ్ధి కోసం ప్రజల్ని మోసం చేయలేనన్న ఆజాద్

ఎన్నికల లబ్ధి కోసం ప్రజల్ని మోసం చేయలేనన్న ఆజాద్

బారాముల్లా: ఆర్టికల్ 370 విషయంలో తాను ప్రజలను తప్పుదోవ పట్టించలేనని కాంగ్రెస్ మాజీ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్న పార్టీ మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించగలదని చెప్పారు. ‘‘తాను ఏం చేయగలడో, ఏం చేయలేడో ఆజాద్‌‌కి తెలుసు. నేనో, కాంగ్రెస్ పార్టీనో, మూడు రీజనల్ పార్టీలో మీకు ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేవు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ లేదా డీఎంకే, లేదా ఎన్సీపీ చీఫ్ శరద్‌‌ పవార్‌‌‌‌తో కూడా ఆర్టికల్‌‌ పునరుద్ధరణ సాధ్యం కాదు” అని చెప్పారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆదివారం తొలిసారి బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆజాద్ మాట్లాడారు. తన నియంత్రణలో లేని అంశాల గురించి తాను లేవనెత్తనని చెప్పారు. ‘‘ఆర్టికల్ 370 గురించి నేను మాట్లాడటం లేదని కొందరు అంటున్నారు. వాళ్లకి నేను ఓ విషయం చెప్పదలచుకున్నా. ఎన్నికల లబ్ధి కోసం ప్రజలను ఆజాద్‌‌ మోసం చేయడు. దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. మిమ్మల్ని తప్పుదోవ పట్టించను” అని అన్నారు. ‘‘గత పదేండ్లలో లోక్‌‌సభలో కాంగ్రెస్ 85 సీట్లకు మించి గెలవడం లేదు. ప్రతి రాష్ట్రంలో ఓడిపోతుండటంతో రాజ్యసభలోనూ ఆ పార్టీ బలం కోల్పోతున్నది. లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 350 సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తుందని నేను అనుకోవడం లేదు. మరి అలాంటప్పుడు నేను దాన్ని (ఆర్టికల్ 370 పునరుద్ధరణ) ఎక్కడ నుంచి పొందగలను? ప్రజలను తప్పుదారి పట్టించడం ఎందుకు?’’ అని ఆజాద్ ప్రశ్నించారు. అలవిగాని హామీలు తాను ఇవ్వనని, చేయగలిగిన వాగ్దానాలు మాత్రమే చేస్తానని చెప్పారు. 

10 రోజుల్లోగా పార్టీ ప్రకటిస్త
కొత్త పార్టీని పది రోజుల్లోగా ప్రకటిస్తానని గులాం నబీ ఆజాద్ చెప్పారు. ‘‘నాకు మద్దతుగా నిలిచిన సహచరులకు ధన్యవాదాలు. వాళ్లే కొత్త పార్టీకి పునాది” అని అన్నారు. ‘‘నా పార్టీ ఆజాద్ అవుతుంది. పార్టీకి ఆజాద్ అని పేరు పెట్టాలని చాలామంది సూచించారు. కానీ నేను అలా పెట్టలేను. పార్టీ స్వతంత్రంగా ఉంటుంది.. ఎవరితోనూ చేరదు లేదా విలీనం కాబోదు. అలాంటివి నా మరణం తర్వాత జరగవచ్చు” అని ఆయన స్పష్టంచేశారు. తాను ఏ రాజకీయ పార్టీకీ వ్యతిరేకం కాదన్నారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌కు రాష్ట్ర హోదా తీసుకురావడంపై తన పార్టీ ఫోకస్ పెడుతుందని ఆజాద్ చెప్పారు. ఉద్యోగాలు, భూమి విషయంలో స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించడం, అభివృద్ధి తీసుకురావడంపై పని చేస్తానని తెలిపారు.