
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించిన మురళీధర్‌రావు
- హైదరాబాద్, సైబరాబాద్ సహా 12 చోట్ల ఏసీబీ సోదాలు
- విల్లాలు, ఫ్లాట్లు, ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు
- మోకిలలో 6,500 చ.గ. స్థలం, కరీంనగర్‌లో
- కమర్షియల్ బిల్డింగ్ సహా కళ్లు చెదిరే ఆస్తుల గుర్తింపు
- వరంగల్‌లో 11 ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు
- నేడు కూడా కొనసాగనున్న తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మురళీధర్‌రావు అరెస్టయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్‌రావుతో పాటు ఆయన బంధువుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని లోటస్ రొల్డనాలో గల మురళీధర్ నివాసం, కొండాపూర్‌లోని వసెల్ల మిడోస్ విల్లా, కరీంనగర్, జహీరాబాద్, కరీంనగర్‌లోని ఆయన సోదరుడు రామ్మోహన్ రావు, బంధువులు రవీందర్‌రావు ఇండ్లు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్,సైబరాబాద్, వరంగల్, కోదాడ, కరీంనగర్‌లో విల్లాలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, వరంగల్‌లో 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంజ్‌కారుతో పాటు మరో రెండు లగ్జరీ కార్లు సీజ్ చేశారు. బంజారాహిల్స్‌లోని మురళీధర్‌రావు నివాసంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లను గుర్తించారు.
ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.150 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మురళీధర్‌రావును వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి.. చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. కాగా, బుధవారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
పదవీ విరమణ తర్వాత కూడా 13 ఏండ్లు ఆ శాఖలోనే..
గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన కాళేశ్వరంసహా భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టుల్లో ఈఎన్సీ మురళీధర్‌రావు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. సబ్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మురళీధర్‌రావు అక్రమాస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఉమ్మడి ఏపీలోనే ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్‌రావుకు.. ఆ తర్వాత కూడా ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఇలా రిటైర్డ్ అయిన తర్వాత కూడా మురళీధర్ రావు 13 ఏండ్ల పాటు విధులు నిర్వర్తించాడు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేశాడు. కాళేళ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు విధుల్లో కొనసాగాడు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఆ ముగ్గురే కీలకం
మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత మురళీధర్‌రావును కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ నివేదికలో వెల్లడించిన 17 మంది ఇంజినీర్లపై ఏసీబీ నజర్ పెట్టింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరాంను మే నెలలో, ఈఈ నూనె శ్రీధర్‌ను జూన్ 11న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అరెస్ట్ చేసింది.
వీరి ఆస్తులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే మురళీధర్ రావు నివాసం, ఆయన బంధువుల ఇండ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. మురళీధర్‌రావు ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరిన నాటి నుంచి పదవీ విరమణ చేసే నాటి వరకు ఆయన జీతభత్యాలు, ఖర్చులు, ఇతర ఆదాయ వనరులుసహా ప్రస్తుత ఆస్తుల లెక్కలు తీస్తున్నది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం సహా స్థిరచరాస్తుల వివరాల ఆధారంగా అక్రమాస్తుల లెక్కను
స్పష్టంగా తేల్చనున్నది.
అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మురళీధర్‌కు ఆస్తులు
మురళీధర్‌రావుకు బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 5లో ఫ్లాట్ ఉండగా.. అందులోనే ఉంటున్నాడు. యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేటలో 3 ఫ్లాట్లు, హైదరాబాద్‌లోని అత్యంత ప్రైమ్ లొకేషన్‌లో కమర్షియల్ బిల్డింగ్, నాలుగు ఖరీదైన ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, బెంజ్ సహా మూడు కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
బంగారం, బ్యాంకు డిపాజిట్ల వివరాలు సేకరించారు. మోకిలలో 6,500 చదరపు గజాల స్థలం, కరీంనగర్‌లో కమర్షియల్ బిల్డింగ్, కోదాడలో అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో 2 కేడబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.150 కోట్లుకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.