- మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ
మంచిర్యాల, వెలుగు: దేశం కోసం, సమాజహితం కోసం రాజకీయాలు ఉపయోగపడాలని హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నాయకులు పదవీకాంక్ష, వ్యక్తిగత స్వార్థం విడనాడాలని, నైతిక విలువలకు కట్టుబడి సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో శనివారం తన జీవిత చరిత్ర ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నాయకులు అధికారం, పదవులు, డబ్బు సంపాదన కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి రావడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలే కారణమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ముందుకు వెళ్తుంటే, కొన్ని విద్రోహశక్తులు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా మార్పు రావాలని అన్నారు. ప్రజలు రోజు పడుతున్న బాధలే తాను రాసిన పుస్తకం ‘ప్రజల కథే నా ఆత్మ కథ’ అని వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు గోనే శ్యాంసుందర్‌రావు, మున్నారాజ్ సిసోడియా, తుల ఆంజనేయులు, తుల మధుసూదన్‌రావు, దుర్గం అశోక్, డాక్టర్ రఘునందన్ పాల్గొన్నారు.
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రిపేర్లు చేయాలి
గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో రిపేర్లు చేసి రైతులకు సాగు నీటిని అందించాలని బండారు దత్తాత్రేయ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీజేపీ నేత బల్మూరి అమరేందర్ రావు, వనిత ఇంట్లో మీడియాతో మాట్లాడారు. రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు పనికి రాకుండా పోయిందన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) రిపోర్టు ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.సంజీవరెడ్డి, మీస అర్జున్‌రావు, తోట మమత, కోమల్ల మహేశ్, మెరుగు హన్మంత్ గౌడ్ పాల్గొన్నారు.
