- భారీ పరిశ్రమలతో పాటు స్టార్టప్‌లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి
- రాష్ట్ర అభివృద్ధిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక సూచనలు
- ఎడ్యుకేషన్‌లో ఏఐ వినియోగంపై కమిటీ వేస్తామన్న సీఎం రేవంత్
- ‘తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక’పై ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్, వెలుగు: యువత తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటేనే వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ‘తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక’పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని కీలక సూచనలు చేశారు.
ఆర్థికాభివృద్ధితో పాటు మానవ వనరుల వికాసం ముఖ్యమని, అందుకోసం రాష్ట్రంలో పోషకాహార లోపం సమస్యను పూర్తిగా తగ్గించాలని సూచించారు. కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి ప్రభుత్వాలు అనుసరించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ఎంతో దోహదపడుతుందని, కానీ కేవలం భారీ పరిశ్రమలే కాకుండా స్టార్టప్‌లను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
తమిళనాడు తరహా పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని, అదే సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని సరైన పద్ధతిలో వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని రాజన్ పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో విద్యుత్, నీటి వినియోగంపై ముందుచూపుతో ఉండాలని సూచిస్తూనే, మరో మూడు నాలుగు నెలల్లో తాను హైదరాబాద్ పర్యటనకు వస్తానని వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పాఠశాల స్థాయి మొదలుకొని ఉన్నత, సాంకేతిక వైద్య విద్య సిలబస్‌లో ఏఐ వినియోగంపై ఒక ప్రత్యేక కమిటీని వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కమిటీకి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన రాజన్‌ను కోరారు. రాష్ట్రంలో మధ్య స్థాయి ఉద్యోగాల కల్పన కోసం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం వివరించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, విద్యుత్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్లతో పాటు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు తీసుకురాబోతున్నామని, రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌లో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని భట్టి పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల కోసం అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి, జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
