
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అవినీతి ఎక్కువైం దని, ఇందులో అక్రమార్కులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించిన ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్ర మంలో పాల్గొన్న వినోద్, ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన వినతు లను తీసుకొని, వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌హెచ్‌ను బెదిరించారని, హెచ్‌సీఏలో పరిపాలన పూర్తిగా విఫలమైందని, అవినీతిమయమైందని ఆరోపిం చారు. హెచ్‌సీఏ గ్రౌండ్‌కు భూమి తమ కుటుంబం ఇచ్చిందని, ఈ స్టేడియాన్ని విశాక నిధులతో మా తండ్రి కాకా వెంకటస్వామి కట్టిం చారని గుర్తుచేశారు.
అలాంటి హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి బాధ కలుగుతోందన్నారు. మళ్లీ హెచ్‌సీఏకు ఎన్నికలు జరిపించాలని, మరోసారి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని చెప్పారు. గాంధీ భవన్‌లో అందుబాటులో ప్రజాప్రతినిధుల ప్రోగ్రామ్ మంచి కార్యక్రమమని, పేదలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండి వారి సమస్యలను తీరుస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనులు అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని, ఇందుకోసం పార్టీ సోషల్ మీడియాను బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.