భారత మాజీ క్రికెటర్‌కు రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

భారత మాజీ క్రికెటర్‌కు రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

భారత మాజీ క్రికెటర్, వెటరన్ పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతను ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు నుజ్జునుజ్జయ్యింది. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్‌తో పాటు తనయుడు కూడా కారులోనే ఉన్నాడు. అయితే ఈ ప్రమాదం నుంచి వాళ్లిద్దరూ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం రాత్రి సమయంలో ప్రవీణ్ కుమార్ కొడుకుతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని పాండవ్ నగర్ నుంచి మీరట్‌కు ప్రయాణిస్తున్నారు. కారు మీరట్‌లోని కమిషనర్ బంగ్లా వద్దకు చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడం, కారు పెద్దది కావడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.. ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

టీమిండియా విజయాల్లో ప్రవీణ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఇరు వైపులా బంతిని స్వింగ్ చేయగల సమర్థుడు. జాతీయ జట్టు తరుపున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఈ వెటరన్ బౌలర్.. మూడు ఫార్మాట్లలో కలిపి 112 వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ 2007 - 2012 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.