జడ్పీటీసీపై కన్నేసి బీఆర్ఎస్లోకి!

జడ్పీటీసీపై కన్నేసి బీఆర్ఎస్లోకి!
  • కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన జన్నారం మాజీ జడ్పీటీసీ భక్షి నాయక్ 

జన్నారం రూరల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో ఒక పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నాయకులు మరో చోట చాన్స్ వెతుక్కుంటూ పార్టీలు మారుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఇదే జరుగుతోంది. మొన్నటికి మొన్న పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం మాజీ సర్పంచ్ జక్కు భూమేశ్, జన్నారం మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరడం తెలిసిందే. 

ఇంతకాలం ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరు కాంప్రమైస్ అయ్యి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చంద్రశేఖర్ హస్తం గూటికి చేరడంతో బీఆర్ఎస్​లో జడ్పీటీసీ ఆశావహులు కరువయ్యారు. మరోవైపు కాంగ్రెస్​లో ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడంతో ముందుగానే అప్రమత్తమైన మాజీ జడ్పీటీసీ భక్షినాయక్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.

ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్​లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో జన్నారం జడ్పీటీసీ స్థానం జనరల్​కు కేటాయించగా... సెప్టెంబర్​లో ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. రానున్న పరిషత్ ఎన్నికల్లో మళ్లీ అదే రిజర్వేషన్ వస్తుందనే ఆశతో భక్షి నాయక్ పార్టీ మారినట్టు లోకల్​గా ప్రచారం జరుగుతోంది.