రవీందర్‌‌ సింగ్‌కు మద్దతుగా మరో 15 మంది రాజీనామా

రవీందర్‌‌ సింగ్‌కు మద్దతుగా మరో 15 మంది రాజీనామా

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌‌ఎస్ పార్టీని పట్టి కుదిపేస్తున్నాయి. కరీంనగర్‌‌లో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఉద్యమంలో పని చేసిన వాళ్లను వదిలేసి ఉద్యమ ద్రోహులకే పదవులు కట్టబెడుతున్నారంటూ టీఆర్‌‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్ కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని గతంలో అనేక సార్లు చెప్పి మోసగించారని ఆరోపించిన ఆయన టీఆర్‌‌ఎస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆ తర్వాత ఆయనకు మద్దతుగా వరుసగా కరీంనగర్‌‌లో పలువురు టీఆర్‌‌ఎస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో 11 మంది టీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెంట నడవాలని నిర్ణయించినట్లు తెలిపారు.  టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇందులో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రె రాజు తోపాటు.. వివిధ డివిజన్లకు చెందిన నేతలు ఉన్నారు.

ఇవాళ మరో 15 మంది రాజీనామా

 కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్ రవీందర్ సింగ్‌కు మద్దతుగా ఇవాళ (మంగళవారం)  మరో 15 మంది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో  తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుంజపడుగు హరిప్రసాద్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ పాలనలో ఒరిగిందేమీ లేదని హరిప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకతీతంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రవీందర్‌‌ సింగ్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణులకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.