మాజీ సీఎం బాబూలాల్ గౌర్ కన్నుమూత

మాజీ సీఎం బాబూలాల్ గౌర్ కన్నుమూత

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాబూలాల్… భోపాల్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ(బుధవారం) ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 2004 ఆగస్ట్ 23 నుంచి 2005 నవంబర్ 29వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు బాబూలాల్. ఆయన మృతికి ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు.

RSS, జన్ సంఘ్ ల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు బాబూలాల్ గౌర్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అరెస్ట్ అయి జైలుకెళ్లారు. 2003లో మధ్యప్రదేశ్ లో ఉమాభారతి ప్రభుత్వం ఏర్పడ్డాక… ఆమె కేబినెట్ లో పట్టణాభివృద్ధి, న్యాయ శాఖ, హౌసింగ్, పర్యావరణం, కార్మిక శాఖలు నిర్వహించారు. సీఎం పదవికి ఉమాభారతి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి అయిన బాబూలాల్ గౌర్… ఏడాది పాటు సీఎం పదవిలో కొనసాగారు. మొత్తంగా ఏడాది 98 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. తర్వాత శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక… ఆయన కేబినెట్ లో అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు బాబూలాల్ గౌర్.