అన్నింటికీ తాళాలేయడమే కాంగ్రెస్​ విధానం: మోదీ

అన్నింటికీ తాళాలేయడమే కాంగ్రెస్​ విధానం: మోదీ

సిమ్లా: అన్నింటికీ తాళాలేయడమే కాంగ్రెస్​ విధానమని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ తాళాలేసే సర్కారు హిమాచల్​ ప్రదేశ్​లో ఆ రాష్ట్ర స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ను మూసేసిందని అన్నారు. అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేయాలని చూస్తున్నదని ఆరోపించారు. హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రంలోని సిర్మౌర్​ జిల్లా నహాన్​లో శుక్రవారం నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర, మండిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. సిర్మౌర్​కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇచ్చే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారని, వారికి తమ సర్కారు 10% రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. ఎవరి రిజర్వేషన్లనూ లాక్కోకుండానే ఈ కోటా ఇచ్చామని తెలిపారు.

నేను దేశం కోసమే ఇక్కడికొచ్చా 

బీజేపీని మూడోసారి గెలిపించేందుకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రజలను మోదీ కోరారు. “నేను ఇక్కడికి నా కోసమో.. నా కుటుంబం కోసమో రాలేదు. దేశాభివృద్ధి, హిమాచల్​ అభివృద్ధి కోసం వచ్చా” అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో నివసించే హిమాచల్​ప్రదేశ్​ ప్రజలకు దృఢమైన దేశం విలువ తెలుసునని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

రామ మందిరాన్ని కాంగ్రెస్​ వ్యతిరేకించింది అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్​ వ్యతిరేకించిందని మోదీ అన్నారు. ‘‘వారు మందిరాన్ని నిర్మించరు.. ఎప్పుడు నిర్మిస్తారో తేదీ చెప్పరు” అంటూ తమను టీజ్ చేసిందని తెలిపారు. తాము తేదీని ప్రకటించడంతోపాటు రామమందిరాన్ని ప్రారంభించామని చెప్పారు.