నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు బీజేపీపై విసిగిపోయారు: ఖర్గే

నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు బీజేపీపై విసిగిపోయారు: ఖర్గే

కలబురగి (కర్నాటక): ఈ ఎన్నికల్లో అన్నిచోట్లా బీజేపీ ఓడిపోతుంటే ఆ పార్టీకి 400 సీట్లు ఎట్లొస్తయని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఓడిపోతామని తెలిసినా మోదీ చార్​సౌపార్​ నినాదాలు ఎలా ఇస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు. ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. తన స్వస్థలమైన కర్నాటక రాష్ట్రంలోని కలబురగిలో ఖర్గే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

 ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిని ప్రజలందరూ ఆదరించారని చెప్పారు. ఈ ఎన్నికలు ప్రజలు, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్నాయని, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు బీజేపీపై విసిగిపోయి ఉన్నారని తెలిపారు. అలాగే, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై పెద్ద దాడి జరుగుతున్నదని ఆరోపించారు. స్వయంప్రతిపత్తి సంస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ పాలన సాగిస్తున్నదని, అందుకే ప్రజలంతా విసిగిపోయి, ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. 

జూన్ 4 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం

ప్రజలందరూ జూన్ 4 దాకా ఆగాలని, ఎన్నికల ఫలితాల తర్వాత తమ (ఇండియా కూటమి) కార్యాచరణ ప్రకటిస్తామని ఖర్గే తెలిపారు. ఈ సారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2019 లోక్​సభ ఎన్నికల్లో తమకు రెండు సీట్లే వచ్చాయని, ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ‘‘మా కూటమి భాగస్వామి డీఎంకే ఓటుబ్యాంకు చెక్కుచెదరలేదు. కేరళలోనూ మేం ఎక్కువ సీట్లు గెలుస్తాం. మహారాష్ట్రలో మా అఘాడీ కూటమి 50శాతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది.

అలాంటప్పుడు బీజేపీకి 400 సీట్లు ఎలా వస్తాయో నాకు అర్థం కావడం లేదు” అని ఖర్గే అన్నారు. ‘‘రాజస్థాన్​లో మాకు జీరో సీట్లున్నాయి. ఈసారి అక్కడ 7 నుంచి 8 గెలుస్తాం. మధ్యప్రదేశ్​లో రెండు సీట్లలో గెలిచాం. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుంది. చత్తీస్​గఢ్​లోనూ గెలువబోతున్నాం. వందశాతం అని అనుకున్న చోట బీజేపీ సంఖ్య తగ్గిపోతున్నది” అని పేర్కొన్నారు. ఇండియా కూటమికి ఎక్కువ సంఖ్యలో సీట్లు వస్తాయని తమకు స్పష్టమైన 
సంకేతాలు ఉన్నాయని ఖర్గే వెల్లడించారు.