మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

 మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళాహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి బాంబ్ బాస్ట్ లో చంద్రబాబుతో పాటుగా బొజ్జల గాయపడ్డారు. 1989, 1994, 1999, 2009, 2014లో 5 దఫాలుగా గెలుపొందిన బొజ్జల ఉమ్మడి రాష్ట్రంలో ఐ.టీ మినిస్టర్ గా ఏ.పీ తొలి మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పని చేశారు. గోపాలకృష్ణారెడ్డి మృతిపై ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం బాధాకరం: చంద్రబాబు 
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని, అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని పేర్కొన్నారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని, బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. 

బొజ్జల మృతిపై కేసీఆర్ విచారం
బొజ్జల మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తనతో కలసి పనిచేసిన బొజ్జల ఆత్మీయుడని.. అలాంటి మిత్రున్ని కోల్పోయానని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాయలసీమ అభివృద్ధి కోసం పనిచేశారు: బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి 
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరం అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. రాయలసీమలో ప్రముఖ రాజకీయనేత , ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన  రాయలసీమ అభివృద్ధి కోసం తనవంతుగా పనిచేసిన సీనియర్ నాయకుడి అకాల మరణానికి చింతిస్తున్నానని పేర్కొన్నారు. బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబీకులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

టీఎంసీ పాలనకి ఏడాది పూర్తి.. మరుసటి రోజే మర్డర్స్

ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు

అవసరం లేని టెస్టులు, సర్జరీలు చేస్తే వైద్యులపై చర్య