
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. శనివారం మిడ్జిల్ మండలంలో బీజేపీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ.. మెరుగైన అభివృద్ధి జరుగుతుందని ప్రజలు పోరాడి తెలంగాణను తెచ్చుకుంటే.. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన సీఎం ను ప్రజలు పదవీ నుంచి తొలగిస్తారని ఆమె అన్నారు.
గ్రామ పంచాయతీ లకు ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా.. సర్పంచ్ కు ,ఉప సర్పంచ్ లకు మధ్య కేసీఆర్ సర్కార్ కొట్లాట పెట్టిందన్నారు డీకే అరుణ. అయితే గ్రామ సర్పంచ్ లకు తాము అండగా ఉంటామని, కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సర్పంచ్ ల హక్కులను కాపాడుతామని ఆమె అన్నారు. 2023లో రాష్ట్రంలో బలమైన శక్తిగా బీజేపీ అవతరించబోతుందని, ఇతర పార్టీల కింది స్థాయి నాయకులు కూడా బీజేపీ వైపే చూస్తున్నారని డీకే అరుణ అన్నారు.